ప్రధానిపై చర్యకు సీబీఐ జంకు
బొగ్గు కుంభకోణంలో దర్యాప్తుపై మోడీ ధ్వజం
యూపీఏ సర్కారు సీబీఐని దుర్వినియోగం చేస్తోంది
ఉదయ్‌పూర్(రాజస్థాన్): కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శల దాడిని తీవ్రం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్రం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని, తన వ్యతిరేకుల గొంతు నొక్కి, అణచివేతకు పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. బొగ్గు కుంభకోణంలో ఆరోపణలున్న ప్రధాని మన్మోహన్ సింగ్‌పై చర్యలు తీసుకోవడానికి సీబీఐ భయపడుతోందన్నారు. తనపై కానీ, ఇతర బీజేపీ నేతలపై కానీ ఒక్క ఆరోపణ వచ్చి ఉన్నా దర్యాప్తు సంస్థ తక్షణమే జైల్లోకి నెట్టేసేదని పేర్కొన్నారు. ‘ప్రధాని కార్యాలయం(పీఎంఓ)పై ఆరోపణలు వచ్చాయి. బొగ్గు స్కాంలో ఓ సీనియర్ అధికారి నేరుగా ప్రధానిపైనే ఆరోపణలు చేశారు.
వసుంధర, నరేంద్ర మోడీ, శివరాజ్ సింగ్, రమణ్‌సింగ్‌లపై ఇలాంటి ఆరోపణలు వచ్చి ఉంటే సీబీఐ వారిని ఉన్నపళంగాకటకటాల వెనక్కి తోసేసేది. అయితే ప్రధాని విషయంలో మాత్రం అది పామును చూసినట్లు కొయ్యబారిపోతోంది’ అని అన్నారు. మోడీ శనివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల వ్యవధే ఉందని, ఆలోపు యూపీఏ సర్కారు తప్పిదాలన్నీ బట్టబయలవుతాయని అన్నారు. ఉల్లి ధరల కట్టడిలో కేంద్రం విఫలమవుతోందని దుయ్యబట్టారు. దిగుబళ్లు ఐదు శాతమే తగ్గగా, ధరలు మాత్రం 1,500 శాతం పెరిగాయన్నారు. ఉల్లిని ఎక్కువగా పండించే కాంగ్రెస్ సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లే దీనికి కారణమని ఆరోపించారు. ఆ రాష్ట్రాల్లో ఎవరు అక్రమంగా నిల్వ చేస్తూ, ధరలు పెంచుతున్నారో కేంద్రానికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
రాజస్థాన్ సర్కారును గద్దె దింపండి..
రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మోడీ నిప్పులు చెరిగారు. సొంత పార్టీనే నమ్మని ఆ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలని ప్రశ్నించారు. 2009లో మతఘర్షణలు జరిగిన గోపాల్‌గఢ్‌ను రాహుల్.. రాజస్థాన్ సర్కారుకు, సీఎంకు చెప్పకుండానే సందర్శించడాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేనన్ని ప్రాజెక్టులు ప్రారంభించిందని, రిబ్బన్ కటింగ్‌లకు కత్తెరలు కరవయ్యాయని ఎగతాళి చేశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వసుంధర రాజే, రాజేంద్ర రాథోడ్ తదితర బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, వారు మంత్రులను క లిసేందుకు భయపడుతున్నారని అన్నారు. అత్యాచార కేసులో అరెస్టయిన మాజీ మంత్రి బాబూలాల్ నగర్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ సర్కారును గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాహుల్ మాటలు అర్థం కావడం లేదు..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తాను యువరాజు(షెహజాదా) అని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ మండిపడుతున్నా మోడీ వెనక్కి తగ్గడం లేదు . ఉదయ్‌పూర్ సభలో రాహుల్‌ను మళ్లీ యువరాజు అని పలుసార్లు సంబోధించి విసుర్లు విసిరారు. ‘నేను చిన్న పరిశోధన చేసి ఓ సంగతి తెలుసుకున్నా. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆ రాష్ట్ర పోలీసు అధికారి ఒకరు యువరాజును కలిసి ముజఫర్‌నగర్- పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ కథనం వినిపించారు. ఆ తర్వాతే యువరాజు.. ఐఎస్‌ఐ ముజఫర్ మతఘర్షణల బాధితులను కలిసిందని దేశమంతా చాటారు. దేశ పగ్గాలను ఇలాంటి వారికి అప్పగిస్తారా?’ అని ప్రశ్నించారు.
ఇటీవలి ఉదయ్‌పూర్ పర్యటనలో రాహుల్ ఏం మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో, ఎవరి కోసం మాట్లాడారో ఆయన పార్టీ నేతలకు సహా ఎవ్వరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. అసలు తానేం మాట్లాడిందీ రాహుల్‌కే తెలియదన్నారు. ఆయన తన నాయనమ్మ, తండ్రుల కథలను ప్రసంగాల్లో వల్లెవేస్తున్నారని, అవి కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుస్తాయని అనుకుంటున్నారన్నారు. రాజస్థాన్ మతఘర్షణలపై అక్కడి కాంగ్రెస్ సర్కారును మైనారిటీ కమిషన్ విమర్శించగా, రాహుల్ మాత్రం లౌకికవాద పాఠాలు వల్లె వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐఎస్‌ఐను కలిసిన ముజఫర్ అల్లర్ల బాధితుల పేర్లు బయటపెట్టాలని, లేకపోతే క్షమాపణ చెప్పాలని మోడీ రాహుల్‌ను శుక్రవారం డిమాండ్ చేయడం తెలిసిందే.