విధి నిర్వహణలో.. మరింత స్వతంత్రత కావాలి: సీబీఐ
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో తమకు మరిం త స్వతంత్రత అవసరమని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. రోజువారీ విధుల నిర్వహణలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) నియంత్రణ.. తమ సామర్ధ్యం, స్వతంత్రతలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. నిష్పక్షపాత, సమర్ధవంతమైన, వేగవంతమైన దర్యాప్తు కోసం తమ డెరైక్టర్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలని పేర్కొంది. సీబీఐ డెరైక్టర్‌కు డీఓపీటీలో ఎక్స్ అఫిషియో కార్యదర్శి అధికారాలు ఇచ్చి, సంబంధిత మంత్రికి సీబీఐ డెరైక్టరే నేరుగా నివేదించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి ఈ మేరకు సీబీఐ తరఫు న్యాయవాది అమిత్ ఆనంద్ తివారీ సోమవారం అత్యున్నత న్యాయస్థానానికి ఒక అఫిడవిట్ సమర్పిం చారు. డీఓపీటీతో అనుసంధానమైన కార్యాలయమైనప్పటికీ.. సీబీఐ రోజువారీ విధులను ఆ శాఖ నియంత్రించే నిబంధనేదీ లేదని అందులో పేర్కొంది. కార్యనిర్వాహక నియంత్రణ నుంచి బయటకు రావాలన్న ఉద్దేశం తమకు లేదని.. అయితే సీబీఐ డెరైక్టర్‌కు పరిపాలన, ఆర్థిక పరమైన అధికారాలు చాలినన్ని లేకపోవడం వల్ల దర్యాప్తు అనవసరంగా ఆలస్యం అవుతోందని వివరించింది. విధి నిర్వహణలో అధికార సంబంధ అంచెలు తీవ్ర అడ్డంకిగా మారాయంటూ పలు ఉదాహరణలను కోర్టుకు తెలిపింది.