సంపాదకీయం: బొగ్గు కుంభకోణం వెల్లడైననాటినుంచీ ఏమీ జరగలేదని దబాయిస్తూ వస్తున్న యూపీఏ ప్రభుత్వం ఎట్టకేలకు దారికొచ్చింది. ‘ఎక్కడో తప్పు జరిగింద’ని సర్వోన్నత న్యాయస్థానం ముందు తాజాగా అంగీకరించింది. చావుకు పెడితే లంఖణానికి రావడం అంటే ఇదే. 195 బొగ్గు క్షేత్రాల కేటాయింపులో లక్షా 86వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని దాదాపు రెండేళ్లక్రితం వెల్లడైనప్పుడు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) అతిగా లెక్కలేసి చూపుతున్నారని కేంద్రం ఆరోపించింది. అంతా సవ్యంగానే ఉన్నదని చెప్పింది. అప్పటికీ, ఇప్పటికీ ఎంత మార్పు! బొగ్గు క్షేత్రాల కేటాయింపు ప్రక్రియలో ఎక్కడో తప్పు జరిగిందని అటార్నీ జనరల్ వాహనవతి న్యాయమూర్తుల ముందు అంగీకరించారు. వాటిని మరింత మెరుగైన పద్ధతిలో చేసి ఉండాల్సిందని కూడా అభిప్రాయపడ్డారు. వాహనవతి వాదననుంచి వెనక్కి వెళ్తే కేంద్రం నోటి వెంబడి రాలిపడిన ఆణిముత్యాలు తారసపడతాయి. 2012 మే నెలలో స్కాం గురించి కాగ్ నివేదిక లీక్ అయినప్పుడు కాంగ్రెస్ పెద్దలంతా ఇంతెత్తున ఎగిరిపడ్డారు. 2జీ స్కాంలో కూడా కాగ్ ఇలాగే వ్యవహరించిందని, ఊహాజనిత గణాంకాలతో ఒక పెద్ద అంకెను సృష్టించి ఏదో జరిగిపోయిందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేందుకు చూసిందని ఆరోపించారు. అదే ఏడాది ఆగస్టులో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను బొగ్గు స్కాం చాపచుట్టే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకుని దానిపై వివరణనిచ్చారు.
ఆ వివరణ మొత్తం కాగ్‌పై ఆరోపణలతోనే నడిచింది. అప్పుడు ఆయనన్న మాటలేమిటి? కాగ్ నివేదిక సర్వం తప్పు దారిపట్టించేలా ఉన్నదని చెప్పారు. బొగ్గును అధికంగా ఉత్పత్తిచేసి దేశావసరాలకు దాన్ని అందుబాటులోకి తేవడమే తమ కేటాయింపుల వెనకున్న ఉద్దేశమని చెప్పారు. కాగ్ చెప్పిన నష్టాలన్నీ ఊహాజనితమైనవన్న సహచర మంత్రుల వాదనను ఆయన గట్టిగా సమర్ధించారు. కాగ్ నివేదికను ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) పరిశీలించడానికి ముందే పార్లమెంటు వేదికపైనుంచి దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్న సంప్రదాయాన్ని ఆయన ఉల్లంఘించారు. అటు సుప్రీంకోర్టు ఆదేశాల పర్యవసానంగా ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు ఈ కేటాయింపుల్లోని కంతలను చాలానే బయటపెట్టింది. మొత్తం 195 బొగ్గు క్షేత్రాలను కేటాయించగా అందులో కేవలం 60 మాత్రమే సరిగా ఉన్నాయని సుప్రీంకోర్టుకు అందజేసిన నివేదికలో వెల్లడించింది.
వాస్తవానికి బొగ్గు కుంభకోణం జరిగినకాలంలో ఆ శాఖ ప్రధాని అధీనంలోనే ఉంది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు కోసం బహిరంగ టెండర్ విధానం అమలు చేయవలసి ఉన్నది. అంతేకాదు... నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన సంస్థల పనితీరు ఎలాంటిదో, వాటి అవసరాలు ఏపాటో స్క్రీనింగ్ కమిటీ కూలంకషంగా ఆరాతీయాలి. ఇలాంటి విధానంలోనే బొగ్గు క్షేత్రాలను కేటాయిస్తామని యూపీఏ ప్రభుత్వమే పార్లమెంటుకు 2004లో చెప్పింది. కానీ, ఆచరణలో అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. స్క్రీనింగ్ కమిటీ అంగీకారానికైనా, తిరస్కృతికైనా ఒక ప్రాతిపదిక లేదు. ఉదాహరణకు 2008లో తన ముందుకొచ్చిన 28 దరఖాస్తుల్లో ఎనిమిదింటిని కమిటీ తిరస్కరించింది. అంగీకరించినవాటికిగానీ, తిరస్కరించినవాటికిగానీ సహేతుకమైన వివరణలు లేవు. పైగా, సంబంధిత శాఖలనుంచి రాని 11 దరఖాస్తులను నిబంధనలకు విరుద్ధంగా నేరుగా తీసుకుంది.
ప్రకృతి ప్రసాదించిన అరుదైన వనరుల్లో బొగ్గు కూడా ఒకటి. దాన్ని అవసరాల ప్రాతిపదికగా మాత్రమే కేటాయించాల్సి ఉండగా, విచక్షణారహితంగా కట్టబెట్టారు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల, నేతల సిఫార్సులే చెల్లు బాటయ్యాయి. పైగా, వాటిని నామమాత్రపు ధరకు కట్టబెట్టారు. చేతికందిన బొగ్గు క్షేత్రాలను చాలా సంస్థలు 2జీ స్పెక్ట్రమ్ స్కాం తరహాలోనే వేరే సంస్థలకు అమ్ముకున్నాయి. ఇలా చేతులు మారిన బొగ్గు క్షేత్రాలవల్ల ఖజానాకు వాటిల్లిన నష్టమెంతో కాగ్ అంచనా వేస్తే ఈ స్కాం 2 లక్షల కోట్ల రూపాయలు దాటినా ఆశ్చర్యంలేదు. చేతికి ఎముక లేకుండా సాగిన వ్యవహారాన్ని కాగ్ ఆరా తీసేసరికి మాత్రం ఎక్కడలేని కోపమూ వచ్చింది.
యూపీఏ ప్రభుత్వం అనుసరించిన ఈ అస్తవ్యస్థ విధానంవల్ల విద్యుదుత్పానారంగానికి, పరిశ్రమలకూ పెను నష్టంవాటిల్లింది. పారిశ్రామికోత్పత్తి మందగించింది. ఉద్యోగకల్పన తగ్గిపోయింది. చాలినంత విద్యుత్తు లభ్యంకాకపోవడంతో ఉక్కు పరిశ్రమల ఉత్పత్తి తగ్గిపోయింది. దేశంలో ఇనుప ఖనిజం నిల్వలు అపారంగా ఉన్నా మన అవసరాలకు కావలసిన ఉక్కును విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సివచ్చింది. ఇలా బహుముఖాలుగా దేశాన్ని నష్టపరిచి కూడా యూపీఏ ప్రభుత్వం తమ తప్పేమీ లేదంటూ చెబుతూ వచ్చింది.
బొగ్గు స్కాంలో ఇంకా చాలా విచిత్రాలు జరిగాయి. ఉన్నట్టుండి కొన్ని కీలక ఫైళ్లకు కాళ్లొచ్చాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, గట్టిగా హెచ్చరించాకే సీబీఐకి ఆ ఫైళ్లు చేరాయి. బొగ్గు క్షేత్రాల కేటాయింపు జరిగాక వివిధ సంస్థలు భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టాయని, దాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ క్షేత్రాల్లో పనులు ప్రారంభించడానికి అనుమతించాలని కేంద్రం సుప్రీంకోర్టులో వింత వాదన మొదలుపెట్టింది. ఒకపక్క తప్పు జరిగిందని అంగీకరిస్తూనే ఇలాంటి వినతి చేయడం వింతే. బొగ్గు క్షేత్రాల కేటాయింపు ప్రక్రియలో తమ పాత్ర చాలా స్వల్పమని, తప్పంటూ జరిగితే అది కేంద్రంవైపునుంచే ఉంటుందని వివిధ రాష్ట్రాలు తప్పుకుంటున్నాయి. కేంద్రం స్వయంగా తానే అంగీకరించింది.
ఇలాంటి పరిస్థితుల్లో బొగ్గు క్షేత్రాల్లో పనులకు అనుమతించమని కేంద్రం ఎలా కోరగలదో ఊహకందని విషయం. నిజానికి కాగ్ వెల్లడించినప్పుడే పొరపాట్లను అంగీకరించి, వెను వెంటనే నిష్పాక్షికమైన విచారణకు పూనుకుంటే ఈపాటికే బొగ్గు క్షేత్రాల్లో పనులు ప్రారంభమై విద్యుదుత్పాదనకు మార్గం సుగమమయ్యేది. కానీ, విలువైన సమయాన్నంతా వృధా వాదనలకు వెచ్చించి, ఇప్పుడు తప్పు ఒప్పుకుని ప్రయోజనమేమిటి? ఈ రెండేళ్ల కాలంలో దేశం ఎన్నో విధాల నష్టపోయింది. అందుకు దేశ ప్రజలకు యూపీఏ సంజాయిషీ ఇవ్వాలి.
యూపీఏ సర్కారు నేరాంగీకారం!
Published Thu, Jan 16 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement
Advertisement