‘బొగ్గు’పై కేంద్రానికి తలంటిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అవినీతి కుంభకోణం కేసు విచారణలో సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని తలంటింది. ఈ కుంభకోణానికి సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నల పరంపర కురిపించిన ధర్మాసనం, కేంద్రాన్ని వివరణ కోరింది. ధర్మాసనం ప్రశ్నలకు బదులు చెప్పేందుకు ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ జీఈ వాహనవతి, సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్, అదనపు సొలిసిటర్ జనరల్ పారస్ కుహాడ్‌లు ఉక్కిరిబిక్కిరయ్యారు. సహజ వనరును కేటాయించేటప్పుడు వేలం ప్రక్రియను ఎందుకు పాటించలేదని ధర్మాసనం ప్రశ్నించింది.
బొగ్గు బ్లాకుల కేటాయింపులో 1992 నాటి పద్ధతులకు చట్టపరమైన అనుమతి ఉందా..? కేటాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు స్క్రీనింగ్ కమిటీకి ఏ చట్టం ప్రకారం అధికారం కల్పించారు..? అని ప్రశ్నించింది. వీటికి బదులిస్తానని, 1992లో సరళీకరణ విధానానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తానని అడ్వొకేట్ జనరల్ వాహనవతి కోర్టుకు హామీ ఇచ్చారు. ఇదివరకు కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐఎల్) బొగ్గు బ్లాకుల కేటాయింపులు చేపడుతుండగా, అందుకోసం స్క్రీనింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది.
సీఎంపీడీఐఎల్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా మారిపోయిందని, దాని పాత్రను స్క్రీనింగ్ కమిటీ పోషించిందని అక్షింతలు వేసింది. అన్నింటిపైనా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసిన ధర్మాసనం, బంతి మీ కోర్టులో ఉందని అడ్వొకేట్ జనరల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అడ్వొకేట్ జనరల్, దీనికి తేలికగా స్పందిస్తూ, ‘ఎక్కువ బంతులు ఉండటంతో గందరగోళం ఏర్పడుతోంది’ అని బదులిచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... బొగ్గు బ్లాకులను ఉచితంగానే కేటాయించారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించింది.