
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సుప్రీం కోర్టు ఝలక్ ఇచ్చింది. కేంద్ర దర్యాప్తు బృందం అభ్యర్థన మేరకు గురువారం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
1995 నాటి ఎస్ఎన్‌సీ-లావలీన్ అవినీతి కేసులో పినరయి విజయన్ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయనను నిర్దోషిగా తేలుస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ అభ్యర్థనను మన్నించిన ధర్మాసనం పినరయితోపాటు మరో ఇద్దరు నిందితులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో నోటీసులకు స్పందించాలని నిందితులను బెంచ్ కోరింది.
2013 నవంబర్ 5న, 1995లో సంకీర్ణ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన విజయన్ రూ.374 కోట్లతో మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల ఆధునీకరణ పనులుచేపట్టినప్పుడు కెనడా కంపెనీ ఎస్ఎన్‌సీ-లావలీన్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయనపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. కానీ, వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోవటంతో విజయన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కున్న ఆరుగురిని సిబిఐ కోర్టు 2013 నవంబర్ 5న నిర్ధోషులుగా ప్రకటించింది. దీంతో సీబీఐ కేరళ హైకోర్టును ఆశ్రయించింది.
అయితే పలువురు విద్యుత్ మంత్రులు ఎస్‌ఎన్‌సీ-లావలీన్‌తో సంప్రదింపులు సాగించినప్పటికీ.. సీబీఐ మాత్రం విజయన్ ఒక్కరినే నిందితుడిగా చేర్చిందని.. కానీ, ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించటంలో సీబీఐ పూర్తిగా విఫలమైందని చెబుతూ సీబీఐ కోర్టు తీర్పునే హైకోర్టు సమర్థించింది.