సీఎం పినరయి విజయన్.. పక్కన మాణిక్య మలరయ పూవీ పాటలో ప్రియా వారియర్
సాక్షి, తిరువనంతపురం : మళయాళంలో ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ‘మాణిక్య మలరయ పూవీ’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. అంతే వివాదాస్పదంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్ బుక్‌లో స్పందించారు. అయితే ఓ సినిమా పాటకు స్పందించిన సీఎంకు.. రాష్ట్రంలో మిగతా సమస్యలు కనిపించటం లేదా? అని సీనియర్ నటుడు, రాజకీయ ఉద్యమకారుడు జాయ్ మాథ్యు.. పినరయిపై విరుచుకుపడ్డారు.
‘పోలీస్ శాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ఓ సినిమా పాట వివాదంపై స్పందిస్తూ భావ స్వేచ్ఛ ప్రకటన అంటూ మద్ధతిచ్చారు. కానీ, రాజకీయ హత్యలు ఆయన కంట పడటం లేదనుకుంటా. కన్నూర్‌లో కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ కార్యకర్తను కొందరు దారుణంగా హత్య చేశారు. వారిని ఇంత వరకు అరెస్ట్ చేయలేకపోయారు. అంటే హంతకులకు కూడా తప్పించుకుని తిరుగే స్వేచ్ఛను విజయన్ ప్రభుత్వం ప్రసాదించారా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బోలెడన్ని సమస్యలు ఉన్నాయని.. అనవసరమైన విషయాలపై స్పందించటం మానేసి.. పనికొచ్చే పనులపై దృష్టిసారిస్తే మంచిదని మాథ్యూ.. విజయన్‌కు సూచించారు.
కాగా, కళలో భావ ప్రకటన స్వేచ్ఛపై అసహనాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని సీఎం పినరయి విజయన్ తన ఫేస్‌బుక్‌లో పాట వివాదంపై స్పందించారు. ఈ క్రమంలో పాట పుట్టుపూర్వోత్తరాల గురించి ఆయన పూర్తి వివరాలు తెలియజేశారు. మాప్పిలపట్లు అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా పీఎంఏ జబ్బర్ రాసిన ఈ పాటను రఫీఖ్ పాడారు. 1978 ఆకాశవాణిలోనే ఈ పాట ప్రసారమైంది. ఏళ్ల తరబడి ముస్లింల వివాహాల్లో ఈ పాటను పాడుతున్నారు కూడా. అలాంటప్పుడు ఒప్పుడు కొత్తగా అభ్యంతరం ఏంటి? ఛాందసవాదం, మతతత్వంపై పోరాటానికి కళలు, సాహిత్యం ఆయుధాలు. వాటిని నాశనం చేసే ప్రయత్నం మంచిది కాదు అని విజయన్ తెలిపారు.
కాగా, ఈ పాట రాసిన జబ్బర్ కూడా వివాదాలు సాధారణమే అని వ్యాఖ్యానించారు. ప్రియా ప్రకాశ్ వారియర్ మూలంగా ఈ పాట పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే సినిమా నుంచి ఈ సాంగ్‌ను తొలగించేలా సెన్సార్ బోర్డుకు, చిత్ర బృందానికి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పలు ముస్లిం సంఘాలు లేఖలు రాశాయి.
Comments
Please login to add a commentAdd a comment