బొగ్గు కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు కొన్ని కనిపించకుండా పోయాయని ప్రభుత్వం చేసిన ప్రకటనపై విపక్షాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి.
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు కొన్ని కనిపించకుండా పోయాయని ప్రభుత్వం చేసిన ప్రకటనపై విపక్షాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటని ధ్వజమెత్తాయి. ఫైళ్లు ఎలా మాయమయ్యాయో, ఎవరు బాధ్యులో వివరణ ఇవ్వాలన్నాయి. ‘ఫైళ్లు కనిపించకుండా పోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అసలేం జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఆదివారమిక్కడ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని సహించేది లేదని, సోమవారం పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తానని బీజేపీ మరో నేత యశ్వంత్ సిన్హా చెప్పారు. ఫైళ్ల అదృశ్యం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని, ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనె త్తుతామని జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ చెప్పారు.