బిర్లాకు బొగ్గు మసి !
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమారమంగళం బిర్లా(46)పై సీబీఐ కేసు నమోదు చేసింది. గనుల కేటాయింపులో ఆయనతోపాటు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, కొంతమంది అధికారులు అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక చట్టం కింద మంగళవారమిక్కడి సీబీఐ కోర్టులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. తర్వాత వెంటనే ఢిల్లీ, హైదరాబాద్, భువనేశ్వర్, ముంబైలలో ఆరుచోట్ల సోదాలు నిర్వహించింది. సోదాలు జరిగిన వాటిలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిండాల్కో కార్యాలయాలు, సికింద్రాబాద్‌లోని పరేఖ్ నివాసం ఉన్నాయి.
ఒడిశాలోని తలబిరాలో ఉన్న రెండో, మూడో నంబరు గనుల కేటాయింపులో అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆదిత్య బిర్లా ప్రతినిధిగా కుమారమంగళం బిర్లా, పరేఖ్‌లతోపాటు హిండాల్కో, బొగ్గు శాఖకు చెందిన కొంతమంది అధికారులు, గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామని సీబీఐ ప్రతినిధి కంచన్ ప్రసాద్ చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలకు ఉద్దేశించిన తలబిరా గనులను ఓ ప్రభుత్వ సంస్థతోపాటు హిండాల్కోకు కూడా కేటాయించారని, 2005లో బిర్లా, పరేఖ్‌ల మధ్య భేటీ తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని, అందుకే ఎఫ్‌ఐఆర్‌లో బిర్లా పేరు చేర్చామని సీబీఐ వర్గాలు చెప్పాయి. తలబిరా గనులను తమిళనాడు ప్రభుత్వ సంస్థ నైవేలీ లిగ్నైట్ లిమిటెడ్‌కు కేటాయించాల్సి ఉండగా, పరేఖ్ వాటిని విద్యుదుత్పత్తి కోసం నైవేలీ లిగ్నైట్, హిండాల్కోలు కలిసి పంచుకోవడానికి అనుమతించారని పేర్కొంది.
ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేందుకు కారణమయ్యారని తెలిపింది. అయితే గనుల్లో పని ప్రారంభించకపోవడంతో ఎంత నష్టం వచ్చిందో చెప్పలేమని, ప్రస్తుతం అంచనా వేస్తున్నామని సీబీఐ వర్గాలు తెలిపాయి. బిర్లా, పరేఖ్‌లను విచారణకు పిలిపిస్తామన్నాయి. తాజా కేసుతో ఈ స్కాంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య 14కు చేరింది. కాగా, తమకు ఎఫ్‌ఐఆర్ ప్రతి అందలేదని, తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని ఆదిత్య బిర్లా గ్రూపు తెలిపింది. సీబీఐ కేసు నేపథ్యంలో హిండాల్కో, ఏబీ నువో కంపెనీల షేర్ల విలువ మంగళవారం కాస్త ఒడిదుడుకులకు లోనైంది. బొగ్గు కుంభకోణంలో మందకొడి దర్యాప్తు, గనుల కేటాయింపుల ఫైళ్ల గల్లంతుపై సుప్రీం కోర్టు సీబీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టడం తెలిసిందే. కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసులపై ఈ ఏడాది డిసెంబర్ నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ స్కాంలో సీబీఐ కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్, బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావులపైనా కేసు పెట్టడం విదితమే.