భారత్ ఆ గోడను నిర్మించడం లేదట
జమ్మూ వద్ద గల భారత్-పాకిస్తాన్ బోర్డర్లో గోడను నిర్మించే ఆలోచనను భారత్ విరమించుకున్నట్లు తెలిసింది. చొరబాటుదారులను అడ్డుకునేందుకు స్మార్ట్ ఫెన్సింగ్ నిర్మించే యోచనలో ఉన్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. ఫెన్సింగ్‌కు అత్యాధునిక టెక్నాలజీతో సెన్సార్లను అమర్చనున్నట్లు తెలిపారు. 2015లో భారత్ వాల్ నిర్మించబోతోందనే చర్యలపై పాకిస్తాన్ యూఎన్ కౌన్సిల్‌ను ఆశ్రయించింది. మిలటరీ ఆపరేషన్స్‌కు ఇబ్బంది కలగొచ్చనే భారత ఆర్మీ కూడా అభ్యంతరం తెలిపింది.
2013లో హీరానగర్/సాంబా సెక్టార్లలో జంట దాడుల తర్వాత 179 కిలోమీటర్ల మేర గోడను నిర్మించాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం కూడా యోచించింది. అయితే, ప్రస్తుతం గోడ నిర్మాణానికి రెండు సమస్యలు అడ్డు వస్తున్నాయని సదరు అధికారి చెప్పారు. ఇంటిలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన ప్రాంతాలు ఎక్కువగా ఉండటం, అక్కడి ప్రజలు ప్రదేశాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడకపోవడం ప్రధాన ఇబ్బందులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఒకవేళ గోడను నిర్మించదలుచుకుంటే కేవలం 25శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ విషయంపై హోంశాఖను ప్రశ్నించగా విస్తృతమైన ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టంను తయారుచేసేందుకు 24 గంటలు కసరత్తులు జరగుతున్నాయని పేర్కొంది.