స్ఫూర్తిదాత.. విద్యాప్రదాత.. చాయ్ వాలా!
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్నారు. అనుకున్నది సాధించాలన్న తపన, బలమైన కోరిక ఉండాలే గానీ అందుకు వయసు, డబ్బు, చదువుతో సంబంధం ఉండదని నిరూపించాడా వృద్ధుడు. ఒడిషాకు చెందిన డి. ప్రకాశ్ రావు చాయ్‌వాలాగా జీవితాన్ని కొనసాగిస్తూనే విద్యా ప్రదాతగా... స్ఫూర్తిదాతగా నిలుస్తున్నాడు.
మురికివాడల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడదన్నదే ప్రకాష్ ఆకాంక్ష.. అందుకే చాయ్ వాలాగా ఉంటూ విద్యాప్రదాతగా మారాడు. కపటం లేని, సంతోషకరమైన జీవితం గడపడంతో పాటు.. తాను చదువుకు దూరమైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదనుకున్నాడు. చిన్నతనంలో చదువుపై అత్యంత మక్కువ చూపిస్తున్నా తండ్రి స్కూల్లో చేర్పించకపోవడంతో ఏమాత్రం చదువుకోలేకపోయాడు. తనకు ఎంతగానో ఇష్టమైన చదువు మురికివాడల్లోని పిల్లలకు దూరం కాకూడదన్నదే ధ్యేయంగా నడుం బిగించాడు.
ప్రకాష్‌ను.. అతడి తండ్రి ఓ చాయ్ దుకాణంలో చేర్పించాడు. 1976 నుంచే ప్రకాష్ రావు టీ దుకాణంలో పనిచేస్తున్నాడు. కానీ అతడిలో చదువు నేర్చుకోవాలన్న తపన చావలేదు. స్కూలు చదువునైనా పూర్తి చేయాలన్నఅతడి కోరిక.. పట్టుదల అతడ్ని ఓ పాఠశాల నడిపించే స్థాయికి చేర్చింది. ఉదయం చాయ్ దుకాణంలో పనిచేస్తూనే ఆ డబ్బుతో నర్సరీ నుంచి మూడో తరగతి వరకూ ఉండే 70 మంది పేద పిల్లలతో పాఠశాల నడుపుతున్నాడు. మూడో క్లాస్ తర్వాత తన స్కూలునుంచి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వాళ్లు చదువుకు దూరం కాకుండా తనవంతు కృషి చేస్తున్నాడు.
పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారిలో బలహీనంగా ఉన్నవారిని గుర్తించి వారికి బిస్కెట్లు, పాలు అందిస్తున్నాడు. ప్రకాష్ రావుకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ కూడా తన స్కూల్లోనే మూడోతరగతి వరకూ చదివారని చెబుతుంటే అతడి కళ్లు మెరుస్తాయి. తాను చదువు చెప్పలేకపోయినా, అనుకున్నది సాధించాడు. చాయ్ వాలా స్ఫూర్తిదాయక జీవనంపై మరిన్ని వివరాలు కింది వీడియోలో చూడొచ్చు.