వ్యభిచార దళారీపై చార్జిషీటు
భువనేశ్వర్: వ్యభిచార వ్యాపార రంగంలో ఆరి తేరిన సునీల్ మెహర్ వ్యతిరేకంగా నేరారోపణ చిట్టా దాఖలైంది. స్థానిక సబ్-డివిజినల్ జుడిషియల్ మేజిస్ట్రేటు(ఎస్డీజేఎమ్) కోర్టులో శుక్రవారం దీనిని దాఖలు చేశారు. ఈ చిట్టాలో 300 పేజీలతో నిందితుని వ్యాపార లావాదేవీలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని పొందుపరిచినట్టు కమిషనరేటు పోలీసులు తెలిపారు. కోల్‌కత్తాలో జంట నగరాల కమిషనరేటు పోలీసులు నిందితుడిని గతంలో అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల 21వ తేదీన జంట నగరాల పోలీసు కమిషనరేటు క్విక్ యాక్షన్ టీమ్(క్యూఏటీ) నిందితుడిని అరెస్టు చేశారు.
శుక్రవారం దాఖలు చేసిన నేరారోపణ చిట్టాలో సునీల్ మెహర్ అనుచరుల్లో 9 మంది నిందితులకు సంబంధించిన వివరాల్ని పొందుపరచి కోర్టుకు సమర్పించారు. నిందితుడు సునీల్ మెహర్ వ్యతిరేకంగా రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల్లో 9 కేసులు పెండింగులో ఉన్నాయి. వీటిలో 3 కేసుల్లో ఆయన మోస్టు వాంటెడ్ నేరస్తుడుగా కొనసాగుతున్నాడు. 150 మంది పైబడి కాలేజి అమ్మాయిలతో మెహర్ వ్యభిచార వ్యాపారాన్ని అత్యంత ఆకర్షణీయంగా నిర్వహిస్తున్నట్లు చార్జి షీటులో పేర్కొన్నారు. కాలేజి అమ్మాయిల్ని కాల్ గాల్స్, పెయిడ్ గర్లు ఫ్రెండ్లుగా వ్యాపారంలో వినియోగించడంలో సిద్ధహస్తుడుగా విచారణలో తేలింది.
సునీల్ వలలో చిక్కుకున్న కిర్గీజ్ మహిళ ఈ ఏడాది మార్చిలో అదృష్టవశాతు తప్పించుకోగలిగింది. యువతుల్ని వ్యభిచారంలో వినియోగించడంలో ఆరి తేరిన నిందితుడు సునీల్ మెహర్ పలుసార్లు పోలీసుల కంటిలో దుమ్ము కొట్టి పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన చార్జి షీటులో సునీల్ మెహర్ వ్యభిచార వ్యాపారం పూర్వాపరాల్ని పొందుపరిచారు. వ్యాపారం ఆరంభం, దీని నుంచి ఆదాయం, యువతీ యువకుల ప్రమేయం, రాష్ట్రేతర ప్రాంతాల్లో ఆయన వ్యాపార శాఖలు వగైరా సమాచారంతో నేరారోపణ చిట్టాని పకడ్బందీగా రూపొందించారు.
గత 10, 15 ఏళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యాపారం నుంచి ఆయన నెలసరి ఆదాయం రూ. 10 నుంచి 15 లక్షల వరకు ఉందని పోలీసు విచారణలో తేలింది. బెంగుళూరు, సిలిగుడి, గుజరాత్, కోల్‌కత్తా ప్రాంతాల్లో సునీల్ మెహర్ వ్యభిచార సామ్రాజ్యం విస్తరించింది. దాదాపు 500 మంది యువతులు, మహిళలు ఈ వ్యాపారంలో ప్రముఖ పాత్రధారులు. వీరిలో కాలేజీ విద్యార్థినుల సంఖ్య సుమారు 150 మంది. పేరొందిన మోడళ్లు(సోగత్తెలు), చలన చిత్ర నటీమణులు వంటి ఆకర్షణీయ మహిళలతో సునీల్ వ్యాపారం హాయిగా సాగించాడు.
వ్యభిచారంతో అనుభవించే వారి నుంచి రూ. 500 నుంచి రూ. 5 లక్షల వరకు సొమ్ము గుంజుతు వ్యాపారాన్ని లాభసాటిగా నడిపించినట్లు సమాచారం. వ్యాపార నిర్వహణ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేటు చేసుకోవడంలో సునీల్ ఆరి తేరాడు. ఫోను కాల్స్, ఆన్‌లైన్ మాధ్యమాల్లో విటుల్ని ఆకట్టుకుంటు వ్యాపారం నిశ్చలంగా నిర్వహించాడు. రాష్ట్రేతర ప్రముఖ ప్రాంతాల్లో పేరొందిన పెయిడ్ గర్లు ఫ్రెండు వ్యభిచార సంస్కృతిని సునీల్ మెహర్ రాష్ట్రానికి పరిచయం చేశాడు. విదేశీ యువతుల్ని కూడా తన వ్యాపారంలో పావులుగా ప్రయోగించిన ఘనుడు. బెంగుళూరు, కోల్‌కత్తా ప్రధాన కేంద్రంగా సునీల్ వ్యభిచార వ్యాపార లావాదేవీల్ని నిర్వహించాడు.