మేడలు, మిద్దెలు కూడా మునక!
చెన్నై: ఎటు చూసినా సగమే కనిపిస్తున్న మిద్దెలు, మేడలు.. వీధులోకి అడుగుపెట్టాలంటే ఇంటిపై నుంచి దూకేయాల్సిన పరిస్థితి.. దూకేశాక పీకల్లోతూ నీరులో అతికష్టం మీద ఒక అడుగు ముందుకు.. ఆ నీటిలో ఏముందో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ విద్యుత్ వైర్లు, ఇతర వస్తువులు కాలికి తగిలి పడేస్తాయోనన్న గుండెల్లో గుబులు.. ఇదీ ప్రస్తుతం చెన్నై నగర దయనీయ పరిస్థితి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై కకావికలమైంది. మేడలు, మిద్దెలు సైతం మునిగిపోయేంత ఎత్తులోకి నీరు చేరింది. ఇప్పటివరకు ఈ వర్షాల కారణంగా 197మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
గత రాత్రి చెంబరామ్ బాక్కమ్ లో 49 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. చెన్నై విమానాశ్రయంలోకి నీరు చేరడంతో 6 తేదీ వరకు విమానాశ్రయ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడికక్కడ విద్యుత్, ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిచిపోయాయి. ప్రజలకు సహాయం చేసేందుకు సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తమిళనాడులో వారం రోజుల పాటు ఉచిత కాల్ సదుపాయాన్ని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ వర్షాల కారణంగా ఇప్పటికి రూ.15 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. తమిళనాడుకు కర్ణాటక ప్రభుత్వం రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించింది.