చెన్నైలో తవ్వే కొద్దీ శవాలు
మార్చురీల్లో పేరుకుపోతున్న మృతదేహాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: వరదలతో అతలాకుతలమైన చెన్నైలో తవ్వేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. చెత్తాచెదారం తొలగించేటప్పుడు బయటపడుతున్న శవాలు అంత్యక్రియలకు నోచుకోక ప్రభుత్వ మార్చురీల్లో పేరుకుపోతున్నాయి. ఈ నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు చెన్నై చెరువులా మారిపోయింది. వరదల్లో కొట్టుకుపోయి, విద్యుదాఘాతానికి గురై వందలాది మంది మృతి చెందారు. నీటిలో గల్లంతైన వారి మృతదేహాలు కొన్ని లభ్యం కాగా, వందలాది శవాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
230 మంది చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నా కనీసం వెయ్యి మందికి పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా నగరంలో పారిశుధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. చెత్తను తొలగిస్తున్న క్రమంలో అందులో కూరుకుపోయిన శవాలు బయటపడుతున్నాయి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మార్చురీకి చేరుస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న మృతదేహాలను భద్రపర్చలేక మార్చురీల సిబ్బంది అవస్థలు పడుతున్నారు. మార్చురీ సామర్థ్యానికి మించి శవాలు వస్తున్నాయి.
మిన్నకుండిపోతున్న బంధువులు
వరద నీటిలో నాని కుళ్లిపోయిన శవాలు గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి. ఉబ్బిపోయిన తమవారి శవాలను గుర్తించే వీలులేదని బంధువులు మిన్నకుండిపోతున్నారు. దీంతో మార్చురీల్లో మృతదేహాల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య పెరిగిన పక్షంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉండటంతో మార్చురీల్లోని వరద మృతదేహాల సంఖ్య గోప్యంగా మారింది. మార్చురీల్లోని శవాల వివరాలు వెల్లడించ వద్దని తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు నోరు మెదపడం లేదు.