
వరద నీటిలో చెన్నై ఐటీ కంపెనీలు
చెన్నై: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరద నీటి ప్రభావం చైన్నైలోని పలు ఐటీ కంపెనీలకు తాకింది. అయితే కీలక సేవలకు అంతరాయం లేదని పలు ఐటీ కంపెనీలు తెలిపాయి. ఇన్ఫోసిస్ క్యాంపస్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో రేపు కూడా ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతేకాకుండా నగరంలో చిక్కుకు పోయిన తమ ఉద్యోగులను రక్షించేపనిలో నిమగ్నమైంది. దీనిపై ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. తమ క్లైంట్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇతర ప్రాంతాలనుంచి సేవలు అందిస్తున్నామని పేర్కొంది.
కీలక సేవలకోసం కాగ్నిజెంట్ సిబ్బంది కార్యాలయాల్లోనే పని చేస్తున్నారు. ముఖ్యమైన సర్వీసులకు అంతరాయం రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కొందరు సీనియర్ ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు కాగ్నిజెంట్ పంపించింది.
వరద ముప్పు తమకు లేదని టీసీఎస్ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తగా తమ కార్యాలయాలను టీసీఎస్ మూసివేసింది. తమ ఉద్యోగులంతా క్షేమమేనని తెలిపింది.