నిఫ్ట్ ఛైర్మన్ గా చేతన్ చౌహాన్
మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ చేతన్ చౌహాన్.. నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (నిఫ్ట్) ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఢిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) వైస్ ప్రెసిడెంట్, సీనియర్ బీసీసీఐ అధికారిగా ఉన్న చౌహాన్.. సొంతంగా ఓ క్రికెట్ అకాడమీని నడపడంతో పాటు, న్యూస్ ప్రింట్ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. తనను నిఫ్ట్ ఛైర్మన్ గా నియమించినందుకు చౌహాన్ ప్రధానమంత్రి మోదీకి, బీజేపీ చీఫ్ అమిత్ షా కు కృతజ్ఞతలు తెలిపారు.
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కు చాలాకాలం పాటు ఓపెనింగ్ పార్టనర్ గా ఉన్న చౌహాన్, రెండుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచారు. నిఫ్ట్ చట్టం 2006 ప్రకారం ప్రముఖ విద్యావేత్త, శాస్త్రవేత్త, సాంకేతిక లేదా వృత్తిపరమైన అనుభవం ఉన్నవారిని ఈ పదవిలో నియమిస్తారు. వీరి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. ప్రస్తుతం నిఫ్ట్ ఛైర్మన్ గా నియమితులైన 68 ఏళ్ల చౌహాన్.. తనకు అప్పగించిన అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు.
మరోవైపు ఇంతకు ముందు డీడీసీఏ విషయంలో అవినీతి అభియోగాలు ఎదుర్కొన్న చౌహాన్ ను నిఫ్ట్ ఛైర్మన్ గా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.