రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ నూతన రాజధాని కాబోయే కొత్త రాయ్‌పూర్ పేరును అటల్ నగర్‌గా నామకరణం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి సేవలకు గుర్తుగా ఈ మార్పు చేయనున్నట్లు పేర్కొంది. ఇదే కాకుండా కొత్త రాజధానిలోని పలు ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు వాజ్‌పేయి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రమణసింగ్ ఆధ్వర్యంలో మంగళవారం భేటీ అయిన మంత్రి వర్గం నిర్ణయించింది. అనంతరం సీఎం మాట్లాడుతూ... 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అందుకే ఆయన పేరు కొత్త రాజధానికి పెడుతున్నట్లు, అలాగే స్మారక స్తూపాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.
రాయ్‌పూర్‌లోని సెంట్రల్ పార్కుకు, బిలాస్‌పూర్ యూనివర్సిటీలోని మెడికల్ కాలేజీకి, మార్వా థర్మల్ ప్లాంట్‌కు, రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వేకు వాజ్‌పేయి పేరు పెట్టనున్నట్లు చెప్పారు. దీంతోపాటు తాను రెండో దశ నిర్వహించే ‘వికాస్ యాత్ర’కు కూడా ‘అటల్ వికాస్ యాత్ర’గా పేరు మార్చామన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం వాజ్‌పేయి పేరుపై కవులకు జాతీయ స్థాయి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఇవ్వనున్నామన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన నవంబర్ 1న ఉత్తమ పాలన అందించిన పంచాయతీలు, మున్సిపాలిటీలకు ‘అటల్ బిహరీ వాజ్‌పేయి సుహాసన్ అవార్డు’ను అందిస్తామన్నారు. అటల్ జీవిత విశేషాలు భావితరాలు తెలుసుకునేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. పోఖ్రాన్ అణు పరీక్షలకు గుర్తుగా రాష్ట్రంలోని ఓ బెటాలియన్‌కు ‘పోఖ్రాన్ బెటాలియన్’గా పేరు పెట్టనున్నామని రమణసింగ్ వివరించారు.
పలు నదుల్లో వాజ్‌పేయి అస్థికలు..
మాజీ ప్రధాని వాజ్‌పేయి అస్థికల్లోని కొంత భాగాన్ని ఆయన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని 10 నదుల్లో కలపనున్నారు. ఈ మేరకు ‘కలశ యాత్ర’పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ మంగళవారం నిర్ణయించింది. ఇందులో తొమ్మిది చోట్లకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి అస్థికలు ఉన్న వాహనాలు బయలుదేరతాయని, మరోచోటికి వెళ్లే వాహనం వాజ్‌పేయి సొంత ఊరు అయిన గ్వాలియర్ నుంచి బయలుదేరుతుందని రాష్ట్ర పార్టీ మీడియా ఇన్‌చార్జి లోకేంద్ర పరాశర తెలిపారు. అలాగే కర్ణాటకలోని 8 నదుల్లో వాజ్‌పేయి అస్థికలను కలపాలని నిర్ణయించినట్లు రాష్ట్ర బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి అస్థికలను తీసుకురానున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలోని 11 నదుల్లో అస్థికల నిమజ్జనం చేయనున్నట్లు రాష్ట్ర బీజేపీ చీఫ్ రావుసాహెబ్ దాన్వే చెప్పారు. కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్, ప్రకాశ్ జవడేకర్ బుధవారం(నేడు) ఢిల్లీ నుంచి అస్థికలను తీసుకొస్తారన్నారు. 11 ప్రభుత్వ, 2 ప్రైవేట్ వర్సిటీల్లో అధ్యయన కేంద్రాల ఏర్పాటు కోసం రూ.20 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. తమిళనాడులోని రామేశ్వరం, కన్యాకుమారిలో సముద్రంలో 26న నిమజ్జనం చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సౌందర్యరాజన్ తెలిపారు. అలాగే కావేరి, వైగై, భవాని నదుల్లోనూ వాజ్‌పేయి అస్థికలను నిమజ్జనం చేస్తామని తెలిపారు. గోవాలో 24న వాజ్‌పేయి అస్థికలను నిమజ్జనం చేస్తామని రాష్ట్ర బీజేపీ పేర్కొంది. మండోవి, జ్వారీ నదుల్లోనూ నిమజ్జనం చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment