ఛోటా రాజన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
ఛోటా రాజన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
Published Sat, Dec 17 2016 9:47 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
మాజీ డాన్ ఛోటా రాజన్ ఏం చేస్తున్నాడో.. ఎలా ఉన్నాడో తెలుసా? అతడి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, పూర్తిగా విషమించిందని అందువల్ల అతడికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సి వస్తోందని తెలిసింది. ఏదైనా బాగా పెద్ద ఆస్పత్రిలో అతడికి కార్డియాలజీ, యూరాలజీ విభాగాల్లో చికిత్స చేయించాలని ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అక్కడి బోర్డ్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం అతడి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారని, ఆ తర్వాతే ఈ సలహా ఇచ్చారని చెబుతున్నారు.
ప్రస్తుతం గుండె సమస్య, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో పాటు... ఛోటా రాజన్‌కు ఇన్సిషనల్ హెర్నియా, లాపరోటమీ, హైపర్‌టెన్షన్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి అతడికి కడుపునొప్పి వస్తుందని, మరోసారి ముక్కులోంచి రక్తం వస్తుందని, ఇంకోసారి అసలు నిద్రపట్టకపోవడం లాంటివి ఉంటాయని.. అందువల్ల ఇప్పటివరకు పూర్తిగా ఏయే సమస్యలు ఉన్నాయో అనే సమగ్ర సమీక్ష కూడా ఇంకా జరగలేదని వైద్యులు అంటున్నారు. రాజన్‌కు తగిన చికిత్స అందించేందుకు వీలుగా పూర్తిగా అతడికి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు సూచించింది.
Advertisement
Advertisement