విక్కీ మల్హోత్రా చేతికి ఛోటా రాజన్ సామ్రాజ్యం!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ ఛోటారాజన్ అరెస్టుతో ఆయన సామ్రాజ్యం పగ్గాలు మరో గ్యాంగ్ స్టర్ విక్కీ మల్హోత్రా చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తున్నది. విక్కీ మల్హోత్రా ఛోటా రాజన్కు కుడిభుజం లాంటివాడు. తన బాస్ ఆశీస్సులతో అతను స్వతంత్ర అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసి.. దావూద్ ఇబ్రహీం 'డీ' గ్యాంగ్కు చెక్ పెట్టాలని భావిస్తున్నాడు. గడిచిన కొద్ది నెలల్లో అతని కదలికలు చూస్తుంటే.. అతడు సొంత గ్యాంగ్తో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నదని అతని కోసం గాలిస్తున్న భద్రతా సంస్థలు చెప్తున్నాయి.
విక్కీ మల్హోత్రా గత రెండు దశాబ్ధాల నుంచి ఛోటారాజన్కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నాడు. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ వెంటే ఉన్నాడు. 2000 సంవత్సరంలో బ్యాంకాక్లో ఛోటారాజన్పై హత్యాయత్నం జరిగిన తర్వాత అతని కీలక అనుచరులు రవి పూజారి, సంతోష్ షెట్టి దూరం జరిగినా.. విక్కీ మాత్రం ధోకా చేయలేదు. 2005లో ఢిల్లీలోని అశోకా హోటల్ వద్ద అరెస్టయిన విక్కీ 2010లో బెయిల్ మీద బయటకొచ్చి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటినుంచి అతను దుబాయ్, ఆఫ్రికా మధ్య చక్కర్లు కొడుతున్నట్టు భావిస్తున్నారు. ఇదే సమయంలో దావూద్ కూడా గ్యాంగ్ కార్యకలాపాలను ఆఫ్రికాకు విస్తరించడం గమనార్హం. 'డీ' కంపెనీ వ్యవహారాలను కమాండ్ చేస్తున్న ఛోటా షకీల్ ముంబైలో అండర్ వరల్డ్ సామ్రాజ్యంలో పట్టుసాధించకుండా నిరోధించేందుకే ఛోటా రాజన్ సామ్రాజ్య పగ్గాలు విక్కీకి ఇచ్చినట్టు భావిస్తున్నారు. విక్కీ మల్హోత్రా గ్యాంగ్ను నిరోధించేందుకు 'డీ' కంపెనీ ప్రయత్నిస్తే.. మళ్లీ ముంబైలో గ్యాంగ్వార్ ప్రారంభమయ్యే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
ఛోటా షకీల్ నుంచి ముప్పు పొంచి ఉండటం, ఆస్ట్రేలియా పోలీసులు తనకోసం గాలిస్తుండటం, అనారోగ్యం తదితర కారణాలతో గత మే-ఏప్రిల్లోనే ఛోటా రాజన్ ఆస్ట్రేలియా నుంచి పలుసార్లు ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపాడని, పెద్దగా సానుకూలత రాకపోవడంతో తనకు తాను ముందుకొచ్చి అతను అరెస్టయి ఉంటాడని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో తనతో టచ్లో ఉన్న విక్కీ మల్హోత్రాను ఒప్పించి.. అతనికి తన సామ్రాజ్యాన్ని అప్పగించి.. ఛోటా రాజన్ అరెస్టయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. విక్కీ గతంలో దావూద్ కంపెనీతో చేతులు కలిపాడని వచ్చిన వార్తలను భద్రతా సంస్థలు తోసిపుచ్చాయి. అతడు ఇప్పటికీ ఛోటా రాజన్కే నమ్మకస్తుడిగా ఉన్నాడని పేర్కొన్నాయి.