ఛోటా రాజన్ వచ్చేది నేడు ఉదయమే!
నేడు ఉదయం ఢిల్లీకి...
బాలి/న్యూఢిల్లీ: మాఫియా డాన్ చోటా రాజన్‌ను సీబీఐ, ఢిల్లీ, ముంబై పోలీసు అధికారులతో కూడిన బృందం భారత్‌కు తీసుకువస్తోంది. రాజన్‌తో ఇండోనేసియాలోని బాలి నుంచి గురువారం(భారత కాలమానం ప్రకారం) రాత్రి 7.45 గంటలకు బయల్దేరిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకోనుంది. దగ్గర్లోని అగ్ని పర్వతం బద్ధలై, పొగ, బూడిద కమ్ముకోవడంతో బాలి విమానాశ్రయాన్ని మూసేయడంతో రాజన్ తరలింపు ఆలస్యమైంది. పోలీసుల వేట తీవ్రం కావడంతో 1988లో రాజన్ దుబాయి పారిపోయాడు.
అక్టోబర్ 25న ఆస్ట్రేలియా నుంచి బాలికి వచ్చిన రాజన్‌ను ఇండోనేసియా పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో రాజన్‌పై హత్య, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు తదితర 75కు పైగా కేసులున్నాయి. వాటిలో దాదాపు 70 ముంబైలోనే నమోదై ఉన్నాయి. టాడా, ఉగ్రవాద నిరోధక చట్టం, మోకా తదితర కఠిన చట్టాల కింద ఆయనపై కేసులున్నాయి. కాగా, రాజన్‌పై ఉన్న అన్ని కేసులను సీబీఐకి అప్పగిస్తున్నట్లు గురువారం మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
అంతర్జాతీయ నేరాల విచారణలో సీబీఐకి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి కేపీ బక్షి తెలిపారు. రాజన్‌కు, కేంద్ర భద్రతాసంస్థలకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ ఒప్పందంలో భాగంగా.. ముంబైలో తనపై ఉన్న కేసుల విచారణను ముంబై పోలీసుల నుంచి తప్పించాలని, తనను మహారాష్ట్ర జైళ్లో పెట్టకూడదని రాజన్ షరతులు విధించినట్లు తెలిపాయి.
అయితే, రాజన్‌ను త్వరలో ముంబైకి తీసుకువస్తామని ముంబై పోలీస్ కమిషనర్ జావేద్ అహ్మద్ స్పష్టం చేయడం విశేషం. రాజన్ హస్తం ఉందని భావిస్తున్న జర్నలిస్ట్ జ్యోతిర్మయి డే హత్యకు సంబంధించిన కేసుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఆస్ట్రేలియాలోని భారతీయ దౌత్య కార్యాలయం నుంచి రాజన్ పొందిన పాస్‌పోర్ట్‌ను భారత్ రద్దు చేసింది.
దీనిపై విచారణకు ఆదేశించింది. తప్పుడు ధ్రువపత్రాలతో పాస్‌పోర్ట్ పొందిన ఘటనలు సాధారణమేనని, అయితే, తమ దృష్టికి వచ్చిన వాటిపై చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. ఒకప్పుడు అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ప్రధాన అనుచరుడైన ఛోటా రాజన్.. 1993 ముంబై పేలుళ్లను వ్యతిరేకించి ‘డీ’ గ్యాంగ్‌కు దూరమయ్యాడు. అనంతరం దావూద్ ఇబ్రహీంకు ప్రధాన శత్రువుగా మారాడు.