రోజంతా చిన్న గదిలో బంధించారు  | Harjit Kaur Exclusive Elderly Woman Deported from US | Sakshi
Sakshi News home page

రోజంతా చిన్న గదిలో బంధించారు 

Sep 27 2025 4:14 PM | Updated on Sep 28 2025 5:16 AM

Harjit Kaur Exclusive Elderly Woman Deported from US

రాత్రంతా నిలబడే ఉండాల్సి వచి్చంది 

శాకాహారినైన నాకు గొడ్డు మాంసం ఇచ్చారు 

కారణం చెప్పకుండా అరెస్టు చేసి బేడీలు వేశారు 

అమెరికా నుంచి డిపోర్ట్‌ అయిన 73 ఏళ్ల పంజాబీ మహిళ ఆవేదన 

ట్రంప్‌ వచ్చాకే ఈ పరిస్థితి అని హర్జిత్‌కౌర్‌ కన్నీళ్లు 

చండీగఢ్‌: అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా ఉంటూ.. ఏ ఒక్కరోజు కూడా ఏ తప్పూ చేయని తనను ఆ దేశ ఇమిగ్రేషన్‌ అధికారులు అత్యంత దారుణంగా భారత్‌కు బలవంతంగా (డిపోర్ట్‌) పంపేశారని పంజాబ్‌కు చెందిన 73 ఏళ్ల హర్జిత్‌కౌర్‌ కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం తన కుటుంబసభ్యులకు వీడ్కోలు కూడా చెప్పనివ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారన్న ఆరోపణలతో హర్జిత్‌కౌర్‌ను అరెస్టు చేసిన ఆ దేశ అధికారులు.. కొద్దిరోజుల క్రితం భారత్‌కు తిప్పి పంపారు. 

ఆమె శనివారం మొహాలీలోని తన సోదరి నివాసంలో మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు. అమెరికా అధికారులు తనతో అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కౌర్‌ స్వస్థలం పంజాబ్‌లోని తార్న్‌తరణ్‌ జిల్లా పంగోటా గ్రామం. భర్త చనిపోవటంతో ఆమె 1992లో ఇద్దరు కుమారులను తీసుకొని అమెరికా వెళ్లారు. కాలిఫోరి్నయాలోని ఈస్‌బేలో స్థిరపడ్డారు. 

శాశ్వత నివాసం కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తును 2012లో అమెరికా అధికారులు తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆమె స్థానిక ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) కార్యాలయానికి వెళ్లి హాజరు వేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఈ నెల 8న ఐసీఈ కార్యాలయానికి వెళ్లిన ఆమెను రెండుగంటలపాటు కూర్చోబెట్టి.. అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల తీరుపై ఆమె కుటుంబసభ్యులు, స్థానిక సిక్కు ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవలే ఆమెను భారత్‌కు బలవంతంగా పంపేశారు. 

కూర్చునే అవకాశం కూడా ఇవ్వలేదు 
మోకాళ్ల సర్జరీ చేయించుకున్న తనను అమెరికా అధికారులు ఒక రాత్రంతా ఓ గదిలో బంధించి కనీసం కూర్చునే సౌకర్యం కూడా కల్పించలేదని హర్జిత్‌కౌర్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ప్రతి ఆరు నెలలకు నేను ఐసీఈ ఆఫీస్‌కు వెళ్లి హాజరు వేయించుకునేదాన్ని ఈ నెల 8న అలాగే వెళ్లాను. కానీ, ఏ కారణం చెప్పకుండానే నన్ను అరెస్టు చేశారు. నా కుటుంబసభ్యులకు కనీసం వీడ్కోలు కూడా చెప్పే సమయం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. 

నన్ను భారత్‌కు తామే తీసుకెళ్తామని నా కుటుంబసభ్యులు అధికారులకు తెలిపి, విమాన టికెట్లు చూపించినా వాళ్లు పట్టించుకోలేదు. నాకు అమెరికాలో వర్క్‌ పరి్మట్‌ ఉంది. ఐడీ, లైసెన్స్‌ అన్నీ ఉన్నాయి. అయినా అరెస్టు చేశారు’అని వాపోయారు. తనకు ఎదురైన పరిస్థితి ఎవరికీ ఎదురుకావద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఏం చెప్పనూ.. ! నా పరిస్థితి ఎవరికీ రాకూడదు. నన్ను అరెస్టు చేసిన తర్వాత అధికారులు నా ఫొటోలు తీసుకొని ఒక రాత్రంతా ఓ గదిలో ఉంచారు.

 అది చాలా చల్లని ప్రదేశం. నాకు కనీసం కూర్చునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. నా చేతులకు బేడీలు వేసి బంధించి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బేకర్స్‌ఫీల్డ్‌కు తీసుకెళ్లారు. మందులు కూడా వేసుకోనివ్వలేదు. నా మొరను ఎవరూ పట్టించుకోలేదు. నేను పూర్తిగా శాకాహారిని. వాళ్లు నాకు గొడ్డుమాంసంతో కూడి భోజనం ఇచ్చారు. దీంతో నేను అది తినలేక చిప్స్, బిస్కట్లతోనే కడుపు నింపుకున్నాను’అని చెప్పారు. ఖైదీలకు వేసినట్లు నాకు ఓ యూనిఫాం వేసి పంపేశారు. నా మనవడు ‘ఈ డ్రస్‌లో నిన్ను చూడలేకపోతున్నా నానమ్మ’ అని బాధపడ్డాడు అని కౌర్‌ తెలిపారు.  

మళ్లీ అమెరికా వెళ్తా 
తాను మళ్లీ అమెరికా వెళ్లగలననే నమ్మకం ఉందని హర్జిత్‌ కౌర్‌ తెలిపారు. ‘భారత్‌లో నాకు ఉండటానికి ఏమీ లేదు. నా కుటుంబమంతా అమెరికాలోనే ఉంది. నా స్వగ్రామంలో నా ఇల్లు ఉందో కూలిపోయిందో కూడా తెలియదు. నేను మళ్లీ అమెరికా వెళ్లి నా కుటుంబాన్ని కలుస్తాననే నమ్మకం ఉంది’అని ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ వచి్చన తర్వాతే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement