భారత్‌పై చైనా విద్వేషపూరిత వీడియో
న్యూఢిల్లీ: భారత్ ఏడు పాపాలు చేసిందంటూ చైనా అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా ఆ వీడియో ఉంది. చైనా మీడియా విడుదల చేసిన వీడియోలో ఉన్న ఏడు పాపాల వివరాలు ఇలా ఉన్నాయి.
1. ట్రెస్‌పాసింగ్
డొక్లాంలోకి భారత్ చైనా అనుమతి లేకుండా ప్రవేశించింది. భారీగా ఆయుధ సామగ్రితో పాటు బుల్డోజర్లను చైనా భూభాగంలోకి భారత్ తీసుకొచ్చింది. వివాద రహితమైన చైనా భూభాగంలోకి భారత్ చొచ్చుకురావడం దుర్మార్గం. మీకు తెలియకుండా మీ ఇంటిపైకి బుల్డోజర్లను తీసుకొస్తే మీకెలా ఉంటుందో ఆలోచించండి. ఇరుగు పొరుగు దేశాలతో ఎలా ప్రవర్తించాలో భారత్ తెలుసుకోవాలి.
2. ద్వైపాక్షిక ఒప్పందం ఉల్లంఘన
చైనా-భారత్‌ల మధ్య జరిగిన ఒప్పందాన్ని తొలుత భారతే ఉల్లంఘించింది.
3. అంతర్జాతీయ చట్టాన్ని తుంగలో తొక్కడం
డొక్లాంను వివాదాస్పద ప్రదేశంగా భారత్ భావించొచ్చు. కానీ, అంతర్జాతీయంగా డొక్లాంను చైనాలో అంతర్భాగంగా గుర్తించారు. 1890లో గ్రేట్ బ్రిటన్, చైనాల మధ్య జరిగిన ఒప్పందంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. దీనికి అంతర్జాతీయ చట్టం రక్షణ కల్పిస్తోంది. భారత్‌కు ఎవరూ చట్టాన్ని ఉల్లంఘించకూడదని నేర్పించలేదా?.
4. తప్పు, ఒప్పుల పేరుతో గందరగోళం
చైనా తప్పు చేసింది, మేం ఒప్పు చేశామంటూ భారత్ ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతోంది.
5. బాధితులపై ఆరోపణలు చేయడం
తప్పు చేసిన భారత్.. బాధితుల(చైనా)పై తిరిగి ఆరోపణలు చేయడం హస్యాస్పదం. డొక్లాంలో రోడ్డు నిర్మించడం భారత్‌కు భద్రతాపరంగా సమస్యలు తెస్తుందనే ఆరోపణలు సరైనవి కావు.
6. భూటాన్‌ను లాగారు..!
డొక్లాం సమస్యలోకి భారత్ భూటాన్‌ను అనసరంగా లాక్కొస్తోంది. వాళ్లు భారత్ నుంచి ఎలాంటి రక్షణను కోరడం లేదు. డొక్లాం అసలు మా భూభాగామే కాదని భూటానే చైనా అధికారులకు చెప్పింది.
7. తప్పని తెలిసి కూడా చేయడం..
చైనా భూభాగంలోకి వచ్చిన భారత సైనికులు ముందు బయటకు వెళ్లిపోవాలి. ఆ తర్వాతే చర్చలకు రావాలి.