Xinhua
-
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం 21 మంది మృతి.. మరో ఘటనలో 11 మంది
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 21 మంది చనిపోయారు. ఈ ఘటనలో 71 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టామన్నారు. మరో ఘటనలో 11 మంది... ఝెజియాంగ్ ప్రావిన్స్ జిన్హువా నగరంలోని ఓ తలుపుల తయారీ ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. కలప, రసాయనాల కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. -
ప్రపంచంలో తొలి ఏఐ యాంకర్లు!
కట్టడాలు, టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్న చైనా మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారి కృత్రిమమేధతో పనిచేసే సింథటిక్ వర్చువల్ యాంకర్లను తెచ్చింది. ప్రభుత్వ అధికారిక వార్తాసంస్థ జిన్హువాలో ఈ కృత్రిమమేధ యాంకర్లు విధులు నిర్వహిస్తున్నారు. మనుషుల్లా హావభావాలు పలికించేలా శాస్త్రవేత్తలు తీర్చిదిద్దారు. వీటిలో ఒక యాంకర్ చైనీస్ భాషలో వార్తలు చదివేలా, మరొకటి ఇంగ్లిష్‌లో చదివేలా సమాచారాన్ని ఫీడ్ చేశారు. చైనాలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ సౌగౌ, జిన్హువాలు సంయుక్తంగా ఈ యాంకర్లను అభివృద్ధి చేశాయి. చైనాలో ప్రతిఏటా జరిగే ‘వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్’ ఈ యాంకర్లను ఆవిష్కరించారు. ఈ విషయమై జిన్హువా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ వర్చువల్ యాంకర్లు అలసట అన్నది లేకుండా 24 గంటలు విధులు నిర్వహిస్తారని తెలిపారు. బ్రేకింగ్ వార్తలను వేగంగా ఈ యాంకర్ల ద్వారా చేరవేయవచ్చన్నారు. World's first #AI news anchor debuts, jointly developed by Xinhua and Chinese search engine company https://t.co/34tyZ4nwrg. https://t.co/2omcc5K9rB pic.twitter.com/qXn5Z3ZkxL — China Xinhua News (@XHNews) 8 November 2018 -
భారత్‌పై చైనా మరో బిత్తిరి వీడియో!
న్యూఢిల్లీ: వ్యంగ్యం పేరిట ఇప్పటికే భారత్‌పై జాతివివక్షాపూరితమైన వీడియోను ప్రసారం చేసిన చైనా అధికారిక మీడియా 'జిన్హుహా'.. తాజాగా మరో బిత్తిరి వీడియోను ప్రసారం చేసింది. అయితే, ఈ వీడియోలో జాతివివక్ష వ్యాఖ్యలు లేకపోవడం గమనార్హం. అంతేకాదు భారత్ పట్ల కొంత సామరస్య వైఖరిని ప్రదర్శించే యత్నం ఈ వీడియోలో కనిపించింది. భారత్ ప్రపంచంలోనే పురాతన నాగరికత గల దేశమని, అద్భుతమైన సంస్కృతి భారత్ సొంతమని వ్యాఖ్యానిస్తూనే.. రెండు నెలలుగా కొనసాగుతున్న డోక్లాం ప్రతిష్టంభనపై చిలుక పలుకులు పలికింది. డోక్లాం వివాదానికి భారతే కారణమని నిందించింది. 'టాక్ ఇండియా' పేరిట జిన్హుహా వార్తాసంస్థ ఓ సిరీస్‌ను ప్రసారం చేస్తున్నట్టు ఈ వరుస వీడియోలను బట్టి అర్థమవుతోంది. '7 సిన్స్ ఆఫ్ ఇండియా' (భారత్ ఏడు పాపాలు) పేరిట గతవారం ప్రసారం చేసిన వీడియోలో జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు, వ్యంగ్యం జిన్హుహా అభాసుపాలైంది. ఆ వీడియోలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. చైనా యాంకర్ సిక్కు మతస్తుడి మాదిరిగా గడ్డం అంటించుకొని భారతీయులను అనుకరించే ప్రయత్నం చేయడం నవ్వుతెప్పించడానికి బదులు వికారం, రోత తెప్పించింది. అంతేకాకుండా భారతే దురాక్రమణ పూరితంగా చైనా భూభాగంలోకి ప్రవేశించిందన్న ఆ దేశ కమ్యూనిస్టు సర్కారు వైఖరిని ఈ వీడియోలోని యాంకర్లు వల్లేవేశారు. తాజా వీడియోలోనూ అవే వ్యాఖ్యలు, వైఖరి ప్రస్ఫుటం కావడం గమనార్హం. డోక్లాం చైనా భూభాగమని, భారతే తమ భూభాగంలోకి చొరబడిందని చెప్పుకొచ్చింది. చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఏమాత్రం సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడలేదని నొక్కి చెప్పుకొంది. అయితే, ఈ వీడియోలో భూటాన్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. భారత్-భూటాన్-చైనా ట్రైజంక్షన్‌లోని డోక్లాం ప్రాంతం భూటాన్‌ది అని, అక్కడ చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం సరికాదని భారత్, భూటాన్ పేర్కొంటున్న సంగతి తెలిసిందే. అయినా, చైనా మొండిగా తన దురాక్రమణ ధోరణితో డోక్లాం తనదేనని వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రతి భారతీయుడూ తెల్సుకోవాల్సిన నిజాలు
న్యూఢిల్లీ: డొక్లాం సమస్యపై చైనా అధికారిక మీడియా 'భారత్ చేసిన ఏడు పాపాలు' అంటూ వీడియో విడుదల చేసింది. అందులో చైనా చేసిన ప్రతిదీ ఒక పచ్చి అబద్దం. డొక్లాంపై భారత్ ఎలాంటి పాపాలు చేయలేదు. సిక్కిం, భూటాన్, చైనా దేశాల మధ్య ఉన్న డొక్లాం సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రతి భారతీయ పౌరుడు/పౌరురాలు డొక్లాం సమస్య గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. భారత్ ఎలాంటి పాపాలు చేయలేదనడానికి మన వద్ద ఆధారాలు ఉన్నాయి. వీటితో చైనా దుర్భుద్దిని మనం ఎండగట్టాలి. భారత్ పాపాలు చేయలేదనడానికి ఈ క్రింది విషయాలే తార్కాణాలు. అసలు నిజాలివీ.. చైనా మీడియా చేసిన ఆరోపణలను నిరూపించాలంటే చారిత్రక డాక్యుమెంట్లను పరిశీలించాల్సిన పని లేదు. చైనా సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా భారత్.. వారి దేశంలోకి ప్రవేశించిందన్న ఆరోపణ అవాస్తవం. తద్వారా అంతర్జాతీయ చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందన్న మాట అసలే పచ్చి అబద్దం. డొక్లాం.. భూటాన్, చైనాల మధ్య వివాదం నెలకొన్న ప్రదేశం. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు 1990 నుంచి ఇప్పటివరకూ చైనా-భూటాన్‌లు 24 రౌండ్లు సమావేశమయ్యాయి. అసలు భూటానే చైనాకు డొక్లాంను అప్పగిస్తే.. మరి సమస్యేమి లేకుండా అన్ని రౌండ్లు ఎందుకు సమావేశాలు జరిపినట్లు?. భూటాన్‌తో చర్చలు జరుగుతుండగానే చైనా డొక్లాంలో రోడ్డు వేసేందుకు ప్రయత్నించింది. అసలు నిజమేమిటంటే చైనానే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది. భారత్ చట్టాన్ని కాపాడేందుకు అడ్డుగా నిలిచింది. 1890 ఒప్పందం యూకే, చైనా, టిబెట్ల మధ్య 1890లో ఓ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందం వల్ల తమకు నష్టం వాటిల్లవచ్చని భావించిన భూటాన్ ఒప్పందంపై సంతకం చేయలేదు. భూటాన్‌కు ఈ ఒప్పందంతో అసలు సంబంధమే లేదు. బ్రిటన్, చైనాలు 1890లో కలకత్తా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో మొత్తం ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి. మొదటి ఆర్టికల్ ప్రకారం డొక్లాం తమ భూభాగామని చైనా వాదిస్తోంది. భూటాన్‌కు చేరువలోని మౌంట్ గ్యెమొచెన్ నుంచి నేపాల్‌ను ఆనుకుంటూ చైనా సరిహద్దు ఉంటుందని మొదటి ఆర్టికల్ సారాంశం. దీంతో డొక్లాం భూభాగం కూడా తమదేనని చైనా ప్రకటించుకుంది. అక్కడ రోడ్డు నిర్మించడానికి సన్నాహాలు మొదలెట్టింది. దీంతో భూటాన్ తొలుత చైనాకు వ్యతిరేకంగా గళమెత్తింది. 18, 19 శతాబ్దాల్లో ఉన్న మ్యాప్‌లను, ఒప్పందంలోని ఆర్టికల్ 1ను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా డొక్లాంతో చైనాకు సంబంధం లేదని భారత్ వాదిస్తోంది. చైనా సరిహద్దు నేపాల్‌కు చేరువలోని బటాంగ్ లా అనే ప్రదేశం వద్ద ముగుస్తుందని అంటోంది. యథాతథ స్థితి 2012.. డొక్లాంలో 2012 నుంచి కొనసాగుతున్న యథాతథ స్థితికి భారత్ చేటు చేస్తుందని చైనా ఆరోపిస్తోంది. కానీ, ఈ ఆరోపణలో నిజం లేదు. భారత సైనికులు ఎన్నో ఏళ్లుగా డొక్లాం సరిహద్దులో భూటాన్ సైనికులతో సమన్వయం చేసుకుంటూ కావలి కాస్తున్నారు. మధ్యలో కొన్నేళ్ల పాటు చైనా బలగాలు డొక్లాం ప్రాంతంలో పహారా కాస్తుండకపోవడంతో భారత్ కూడా అక్కడి నుంచి సైన్యాన్ని ఉప సంహరించింది. 2012లో భారత విదేశాంగ శాఖ చైనా, భారత్, భూటాన్‌ల మధ్య జరిగిన యథాతథ స్థతికి సంబంధించిన ఒప్పందంపై వివరణ ఇచ్చింది. మూడు దేశాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే డొక్లాంపై ఒక నిర్ణయానికి రావాలనేది దీని సారాంశం. దీని ద్వారా భూటాన్, భారత్‌ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా డొక్లాం తమదేనని అంటున్న చైనా వాదన సరైనది కాదని తెలిసిపోతుంది. భూటాన్-చైనాల సరిహద్దు చర్చలను భారత్ అడ్డుకుంటోందా? చైనా-భూటాన్‌ల సరిహద్దు చర్చలలోకి భారత్ తలదూర్చి, ఒప్పందాలు కుదరకుండా చేస్తోందనేది చైనా మరో ఆరోపణ. ఇది మరో పచ్చి అబద్దం. గత ఇరవై ఏళ్లుగా చైనాతో భూటాన్ జరుపుతున్న చర్చలే ఇందుకు నిదర్శనం. 2007 వరకూ అంతర్జాతీయ రాజకీయాలన్నింటిని భూటాన్ భారత్ ద్వారా జరిపిందన్న మాట వాస్తవం. ఇందుకు భారత్-భూటాన్‌ల మధ్య స్నేహహస్తం ఒప్పందం ఉంది. భారత్ ఓ చొరబాటు దేశమా? డొక్లాంలోకి భారత్ సైన్యంతోటి చొరబాటుకు పాల్పడిందని చైనా ఆరోపించింది. ఇందులో నిజం లేదు. భారత్ ఎప్పుడూ డొక్లాం తన భూభాగామని పేర్కొన లేదు. భూటాన్ సైన్యాన్ని తమకు అడ్డు తొలగించుకోవాలని చైనా ప్రయత్నించింది. దీంతో సాయం కోసం భూటాన్ భారత్ తలుపు తట్టింది. ఆపన్న హస్తంతో మేం ఉన్నామంటూ భారత్ చైనా ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పాటు, భూటాన్‌కు రక్షణగా నిలవడానికి యథాతథ స్ధితి ఒప్పందాన్ని చైనాకు చూపింది. ముందు చైనా సైనికులను ఉపసంహరించుకుంటే మేం కూడా ఉపసంహరించుకుంటామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకే భారత్‌పై చైనా బుసలు కొడుతోంది. సంబంధిత వార్త : భారత్‌పై చైనా విద్వేషపూరిత వీడియో -
భారత్‌పై చైనా విద్వేషపూరిత వీడియో
న్యూఢిల్లీ: భారత్ ఏడు పాపాలు చేసిందంటూ చైనా అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా ఆ వీడియో ఉంది. చైనా మీడియా విడుదల చేసిన వీడియోలో ఉన్న ఏడు పాపాల వివరాలు ఇలా ఉన్నాయి. 1. ట్రెస్పాసింగ్ డొక్లాంలోకి భారత్ చైనా అనుమతి లేకుండా ప్రవేశించింది. భారీగా ఆయుధ సామగ్రితో పాటు బుల్డోజర్లను చైనా భూభాగంలోకి భారత్ తీసుకొచ్చింది. వివాద రహితమైన చైనా భూభాగంలోకి భారత్ చొచ్చుకురావడం దుర్మార్గం. మీకు తెలియకుండా మీ ఇంటిపైకి బుల్డోజర్లను తీసుకొస్తే మీకెలా ఉంటుందో ఆలోచించండి. ఇరుగు పొరుగు దేశాలతో ఎలా ప్రవర్తించాలో భారత్ తెలుసుకోవాలి. 2. ద్వైపాక్షిక ఒప్పందం ఉల్లంఘన చైనా-భారత్‌ల మధ్య జరిగిన ఒప్పందాన్ని తొలుత భారతే ఉల్లంఘించింది. 3. అంతర్జాతీయ చట్టాన్ని తుంగలో తొక్కడం డొక్లాంను వివాదాస్పద ప్రదేశంగా భారత్ భావించొచ్చు. కానీ, అంతర్జాతీయంగా డొక్లాంను చైనాలో అంతర్భాగంగా గుర్తించారు. 1890లో గ్రేట్ బ్రిటన్, చైనాల మధ్య జరిగిన ఒప్పందంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. దీనికి అంతర్జాతీయ చట్టం రక్షణ కల్పిస్తోంది. భారత్‌కు ఎవరూ చట్టాన్ని ఉల్లంఘించకూడదని నేర్పించలేదా?. 4. తప్పు, ఒప్పుల పేరుతో గందరగోళం చైనా తప్పు చేసింది, మేం ఒప్పు చేశామంటూ భారత్ ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతోంది. 5. బాధితులపై ఆరోపణలు చేయడం తప్పు చేసిన భారత్.. బాధితుల(చైనా)పై తిరిగి ఆరోపణలు చేయడం హస్యాస్పదం. డొక్లాంలో రోడ్డు నిర్మించడం భారత్‌కు భద్రతాపరంగా సమస్యలు తెస్తుందనే ఆరోపణలు సరైనవి కావు. 6. భూటాన్‌ను లాగారు..! డొక్లాం సమస్యలోకి భారత్ భూటాన్‌ను అనసరంగా లాక్కొస్తోంది. వాళ్లు భారత్ నుంచి ఎలాంటి రక్షణను కోరడం లేదు. డొక్లాం అసలు మా భూభాగామే కాదని భూటానే చైనా అధికారులకు చెప్పింది. 7. తప్పని తెలిసి కూడా చేయడం.. చైనా భూభాగంలోకి వచ్చిన భారత సైనికులు ముందు బయటకు వెళ్లిపోవాలి. ఆ తర్వాతే చర్చలకు రావాలి. -
భారత్ కు చైనా మీడియా బెదిరింపులు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలన్న భారత్ నిర్ణయంపై చైనా మీడియా బెదిరింపులకు దిగింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో సభ్యత్వానికి చైనా మద్దతు పలుకలేదన్న కక్షతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇందుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. భారతీయులకు తమ దేశ వీసాలు ఇవ్వడం చైనా మరింత కష్టతరం చేసే అవకాశముందని తెలిపింది. దీనివల్ల చైనాలో ఉంటున్న భారత జర్నలిస్టులపై ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. చైనా వార్తాసంస్థ జిన్హుహాకు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఆ ముగ్గురు జర్నలిస్టుల కదలికలపై నిఘా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో తమకు మద్దతు ఇవ్వకపోవడంపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇందుకు తీవ్ర పరిణామాలు తప్పవ అని జాతీయ టాబ్లయిడ్ గ్లోబల్ టైమ్స్ ఆదివారం హెచ్చరించింది. వీసాల విషయంలో భారత్ చర్యలకు తమ ప్రతి చర్యలు తప్పకుండా ఉంటాయని, కొందరు భారతీయులకు వీసాలు దొరకడం ఇక కష్టతరంగా మారుతుందని హెచ్చరించింది. -
చైనాకు భారత్ ఝలక్!
న్యూఢిల్లీ: చైనా వార్తాసంస్థ జిన్హుహాకు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలని భారత్ నిర్ణయించింది. చైనాకు చెందిన ఆ ముగ్గురు జర్నలిస్టుల కదలికలపై నిఘా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చైనీస్ జర్నలిస్టులను భారత్ నుంచి బహిష్కరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఢిల్లీలో జిన్హుహా బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్న వు కియాంగ్, ముంబైలోని అతని సహచరులు లు తాంగ్, షె యంగాంగ్లను జూలై 31లోగా దేశం విడిచి వెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. మారుపేర్లతో, ఇతర వ్యక్తుల మాదిరిగా ఈ ముగ్గురు జర్నలిస్టులూ దేశంలోని ఆంక్షలున్న ప్రాంతాలను సందర్శిస్తున్నారని, వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని నిఘా ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జిన్హుహాకు చెందిన ముగ్గురు సిబ్బంది వీసాలను అధికారులు రద్దుచేశారు. వు కియాంగ్ గత ఆరేళ్లుగా పొడిగింపు వీసాతో దేశంలో పనిచేస్తుండగా, అతని సహచరులు కూడా గతంలో వీసా కాలపరిమితి పొడిగింపు పొందారు. ప్రభుత్వ గొంతుక అయిన జిన్హుహా చైనాలో బలమైన, ప్రభావవంతమైన వార్తాసంస్థగా పేరొందింది.