భారత్ కు చైనా మీడియా బెదిరింపులు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలన్న భారత్ నిర్ణయంపై చైనా మీడియా బెదిరింపులకు దిగింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో సభ్యత్వానికి చైనా మద్దతు పలుకలేదన్న కక్షతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇందుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. భారతీయులకు తమ దేశ వీసాలు ఇవ్వడం చైనా మరింత కష్టతరం చేసే అవకాశముందని తెలిపింది. దీనివల్ల చైనాలో ఉంటున్న భారత జర్నలిస్టులపై ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది.
చైనా వార్తాసంస్థ జిన్హుహాకు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఆ ముగ్గురు జర్నలిస్టుల కదలికలపై నిఘా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో తమకు మద్దతు ఇవ్వకపోవడంపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇందుకు తీవ్ర పరిణామాలు తప్పవ అని జాతీయ టాబ్లయిడ్ గ్లోబల్ టైమ్స్ ఆదివారం హెచ్చరించింది. వీసాల విషయంలో భారత్ చర్యలకు తమ ప్రతి చర్యలు తప్పకుండా ఉంటాయని, కొందరు భారతీయులకు వీసాలు దొరకడం ఇక కష్టతరంగా మారుతుందని హెచ్చరించింది.