చైనాకు భారత్ ఝలక్!
న్యూఢిల్లీ: చైనా వార్తాసంస్థ జిన్హుహాకు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలని భారత్ నిర్ణయించింది. చైనాకు చెందిన ఆ ముగ్గురు జర్నలిస్టుల కదలికలపై నిఘా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చైనీస్ జర్నలిస్టులను భారత్ నుంచి బహిష్కరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఢిల్లీలో జిన్హుహా బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్న వు కియాంగ్, ముంబైలోని అతని సహచరులు లు తాంగ్, షె యంగాంగ్‌లను జూలై 31లోగా దేశం విడిచి వెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. మారుపేర్లతో, ఇతర వ్యక్తుల మాదిరిగా ఈ ముగ్గురు జర్నలిస్టులూ దేశంలోని ఆంక్షలున్న ప్రాంతాలను సందర్శిస్తున్నారని, వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని నిఘా ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జిన్హుహాకు చెందిన ముగ్గురు సిబ్బంది వీసాలను అధికారులు రద్దుచేశారు. వు కియాంగ్ గత ఆరేళ్లుగా పొడిగింపు వీసాతో దేశంలో పనిచేస్తుండగా, అతని సహచరులు కూడా గతంలో వీసా కాలపరిమితి పొడిగింపు పొందారు. ప్రభుత్వ గొంతుక అయిన జిన్హుహా చైనాలో బలమైన, ప్రభావవంతమైన వార్తాసంస్థగా పేరొందింది.