వారు బాధ్యత గుర్తించాలి | Citizens Responsibility To Take Care Of Public Property | Sakshi
Sakshi News home page

వారు బాధ్యత గుర్తించాలి

Published Thu, Dec 26 2019 1:45 AM | Last Updated on Thu, Dec 26 2019 9:07 AM

Citizens Responsibility To Take Care Of Public Property - Sakshi

బుధవారం లక్నోలో ఆవిష్కరించిన వాజ్‌పేయి 25 అడుగుల భారీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్న ప్రధాని మోదీ

ఆందోళనకారులు తమ హక్కులు, బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలి. ఆందోళనల్లో గాయపడిన పోలీసులు, సామాన్యులు ఏం తప్పు చేశారు?. ఆర్టికల్‌ 370 రద్దు, రామజన్మభూమి సమస్య శాంతియుతంగానే పరిష్కారమయ్యాయి. సవాళ్లకే సవాలు విసరడం మా నైజం. దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో వాజ్‌పేయి పేరు నిలిచి ఉంటుంది.   అటల్‌ ప్రధానిగా ఉండగా జరిగిన పోఖ్రాన్‌ అణు పరీక్షలు, కార్గిల్‌ యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను శక్తిమంతమైన దేశంగా నిలిపాయి.     
– ప్రధాని మోదీ

లక్నో: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చేసిన పని సరైందా అన్నది వాళ్లు (ఆందోళనకారులు) తమని తాము ప్రశ్నించుకోవాలి. వాళ్లు తగులబెట్టింది ఏదైనా కానీ.. వారి పిల్లలకు ఉపయోగపడేదేగా’ అని ఆయన ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ లక్నోలో 25 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటల్‌ పేరుతో ఏర్పాటు కానున్న వైద్య విశ్వవిద్యాలయానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. లక్నోలోని లోక్‌భవన్‌లో ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఆందోళనకారులు తమ హక్కులు, బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలని అన్నారు. ఆందోళనల్లో గాయపడ్డ, పోలీసులు, సామాన్యులు ఏం చేశారని ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370 రద్దుతో ఓ పాత జబ్బు శాంతియుతంగా నయమైపోయిందన్నారు.

రామజన్మభూమి సమస్య కూడా శాంతియుతంగానే పరిష్కారమైందని అన్నారు. తమ పిల్లల మాన మర్యాదలను కాపాడుకునేందుకు భారత్‌ వచ్చిన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ ప్రజలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ చట్ట సవరణ అనే సమస్యకు 130 కోట్ల మంది భారతీయులు ఒక పరిష్కారాన్ని ఆవిష్కరించారని అన్నారు. ఈ ఆత్మ విశ్వాసంతో భారత్‌ నవ దశాబ్దంలోకి ప్రవేశిస్తోందని మిగిలిన అన్ని పనులు పూర్తి చేసే లక్ష్యంతో సాగుతోందని అన్నారు. సవాళ్లకే సవాలు విసరడం తమ నైజమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీ బెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటిదాకా మొత్తం 15 మంది మరణించగా, సుమారు 263 మంది గాయపడ్డారు.

ఇదిలా ఉండగా.. హిమాచల్‌ప్రదేశ్‌ను లదాఖ్, జమ్మూకశ్మీర్‌లతో కలిపే రోహ్‌తంగ్‌ సొరంగానికి మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై ఈ సొరంగాన్ని అటల్‌ టన్నెల్‌గా పిలుస్తారని ప్రధాని మోదీ బుధవారం ప్రకటించారు. ఈ సొరంగానికి 2003లో వాజ్‌పేయి శంకుస్థాపన చేశారు.

బొట్టు బొట్టు ఒడిసిపట్టాల్సిందే!
మెరుగైన సాగుపద్ధతులు పాటించడం, నీటి అవసరం తక్కువ ఉన్న పంటలు పండించడం ద్వారా రైతులు జల సంరక్షణకు పాటుపడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలో భూగర్భ జల సంరక్షణ పథకమైన ‘అటల్‌ జల్‌ యోజన’ను మోదీ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన ఈ పథకం ఏడు (మహారాష్ట్ర, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక) రాష్ట్రాల్లోని 78 జిల్లాలు, 8,300 గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు కృషి చేస్తుందని చెప్పారు. దేశంలో వ్యవసాయం అధికంగా భూగర్భ జలాలపై ఆధారపడి ఉందని, నీటిని పొలాలకు మళ్లించేందుకు ఇప్పటికీ పాత పద్ధతులను ఉపయోగిస్తున్నారని ప్రధాని తెలిపారు.

దీనివల్ల చాలాసార్లు నీరు వృథా అవుతోందని అన్నారు. నీటి అవసరం ఎక్కువగా ఉన్న చెరకు పంట సాగయ్యే ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోవడాన్ని  గమనించామన్నారు. ఈ పరిస్థితులను మెరుగుపరిచేందుకు రైతుల్లో జలసంరక్షణపై అవగాహన మరింత పెరగాలని అన్నారు. దేశంలోని ప్రతి గ్రామం నీటి వాడకానికి సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పథకాల ద్వారా అందించే నిధుల సాయంతో జల సంరక్షణ పనులు చేపట్టాలని కోరారు. భూగర్భ జల మట్టాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు పరస్పర సహకారంతో నీటి బడ్జెట్‌లు రూపొందించుకుని తదనుగుణంగా పంటల పెంపకం చేపట్టాలని వివరించారు.

ఐదేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల ఖర్చు
భూగర్భ జల వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అటల్‌ జల్‌ యోజన ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని మోదీ తెలిపారు. గత 70 ఏళ్లలో దేశంలోని మొత్తం 18 కోట్ల గృహాల్లో మూడు కోట్లకు మాత్రమే పైపుల ద్వారా తాగునీటి సౌకర్యం ఒనగూరిందని, తమ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో మిగిలిన 15 కోట్ల కుటుంబాలకు తాగునీటిని చేర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నాయని మోదీ తెలిపారు.

25 అడుగుల ఎత్తు
వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని శిల్పి రాజ్‌కుమార్‌ పండిట్‌ రూపొందించారు. 25 అడుగుల ఎత్తు, 5 టన్నుల బరువున్న ఈ విగ్రహతయారీకి రూ.89 లక్షలు ఖర్చయింది. పండిట్‌ నేతృత్వంలోని 65 మంది కళాకారులు ఆరు నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారు. బిహార్‌కు చెందిన రాజ్‌కుమార్‌ పండిట్‌ జైపూర్‌ కేంద్రంగా కాంస్యం, అల్యూమినియం, ఇత్తడి వంటి లోహాలతో ప్రముఖుల విగ్రహాలను వేలాదిగా తయారు చేశారు. ఈయన తయారుచేసిన అత్యంత ఎత్తైన 47 అడుగుల పాండవవీరుడు అర్జునుడి విగ్రహాన్ని జైపూర్‌లో ప్రతిష్టించారు.

ఢిల్లీలోని వాజ్‌పేయి స్మారకం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement