న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగబద్ధమైందేనని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దేశం ప్రస్తుతం కష్ట సమయంలో ఉందనీ, హింసాయుత పరిస్థితులకు బదులుగా శాంతిని నెలకొల్పేందుకు కృషి జరగాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. సీఏఏ రాజ్యాంగబద్ధమైందేనంటూ ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ బాబ్డే, జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌ల బెంచ్ విచారించింది. సీఏఏ విషయంలో జోక్యం చేసుకుని, ఈ చట్టం రాజ్యాంగ బద్ధమయిందేనని ప్రకటించాలని, దీనిని అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించాలంటూ పిటిషనర్ తరపు లాయర్ వినీత్ ధండా కోరారు.
రాజకీయ నేతల కారణంగా చట్టంపై ప్రజల్లో ఏర్పడిన సందిగ్ధాన్ని తొలగించేందుకు కోర్టు సాయపడాలన్నారు. స్పందించిన ధర్మాసనం.. సీఏఏకు అనుకూలంగా వచ్చిన ఈ పిటిషన్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం హింసాయుత ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ముందుగా శాంతియుత వాతావరణం ఏర్పడాలి. ఒక చట్టం చట్టబద్ధతను కోర్టులు నిర్ణయించగలవే తప్ప, అవి రాజ్యాంగబద్ధమని ప్రకటించజాలవు. కానీ, సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ముందుగా విచారణ చేపడతాం’అని పేర్కొంది. సీఏఏ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను 22వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment