జాడలేని విమానం
కొనసాగుతున్న గాలింపు
- స్వయంగా సమీక్షించిన రక్షణ మంత్రి పరీకర్
-150 నాటికల్ మైళ్ల దూరంలో ఓ వస్తువు
- అది విమాన శకలమా? కాదా? అని పరిశీలన
చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై నుంచి బయలుదేరి అదృశ్యమైన ఏఎన్-32 వైమానిక దళ విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. 29 మందితో బంగాళాఖాతం మీదుగా పోర్టు బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం జాడ కనుగొనేందుకు వైమానిక, నౌకా దళాలు విస్తృతంగా అన్వేషిస్తున్నాయి. 18 నౌకాదళ, తీరరక్షక నౌకలు, ఓ జలాంతర్గామి, ఎనిమిది వాయుసేన విమానాలు (పీ 81, సీ130) గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. రెండు రోజులు గడుస్తున్నా విమానం జాడ తెలియకపోవటంతో బాధితుల కుటుంబాల్లో ఆందోళన పెరిగిపోతోంది. రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ శనివారం చెన్నై చేరుకుని.. గాలింపు చర్యలను స్వయంగా సమీక్షించారు. అనంతరం రెండు గంటలపాటు ఏరియల్ సర్వే చేశారు.
వివిధ ప్రభుత్వ వనరులను వినియోగించుకుని విమానం జాడ కనుగొనేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. 24 గంటలుగా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆపరేషన్ జరుగుతున్న తీరును ఆయన ప్రశంసించారు. విమానంలో ఉన్న వారి కుటుంబాలతో నిరంతరం సంభాషిస్తూ వారికి కావాల్సిన సమాచారాన్ని అందజేయాలని కమాండర్లను ఆదేశించారు. అంతకుముందు.. అరక్కోణంలో నేవీ, వైమానిక అధికారులు మంత్రికి గాలింపు చర్యల గురించి వివరించారు. అనంతరం పీ-81 విమానంలో గాలింపు చర్యలు జరుగుతున్న తీరును ఆయన పర్యవేక్షించారు. ఏఎన్-32 విమానంతో సంబంధాలు తెగినట్టుగా భావిస్తున్న ప్రదేశం వరకు పర్యటించారు.
తర్వాత అరక్కోణంలో నేవీ, వైమానిక దళం, కోస్టుగార్డులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎస్‌ఏఆర్‌ను మంత్రి సమీక్షించారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించినట్టు తెలిసింది. ఈ కమిటీ ప్రాథమిక విచారణ ప్రారంభించినట్టు సమాచారం. దీని పనితీరును మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఇందులో వైమానిక, నౌకాదళం వర్గాలతో పాటు, సాంకేతిక నిపుణుల్ని నియమించినట్టు తెలి సింది. ప్రమాదం జరిగే అవకాశ ఉందని భావిస్తున్న ప్రాంతంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్న నౌకాదళ అధికారి ఒకరు తెలిపారు. చెన్నైలోని తాంబరం ఎయిర్‌పోర్టునుంచి శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరిన రష్యా తయారీ ఏఎన్-32 వైమానిక దళ విమానానికి 16 నిమిషాల తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోవడం తెలిసిందే.
ఆ వస్తువు విమాన శకలమా?
చెన్నైకి 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఓ వస్తువు కనిపించిందని ప్రాథమిక సమాచారం అందింది. దీంతో అది విమాన శకలమా, కాదా? అనే విషయంలో ఆసక్తి నెలకొంది. వైమానిక దళం ఇచ్చిన సమాచారంతో ఆ పరిసరాల్లో గాలింపు తీవ్రంగా కొనసాగుతోంది.
రంగంలోకి ఇస్రో: బంగాళాఖాతంలో గల్లంతైన వైమానిక దళ విమానం ఆచూకీ కనుక్కునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్రో సాయం కోరింది. దీంతో రిసాట్ (రాడార్ చిత్రాల ఉపగ్రహం) ద్వారా విమానం జాడ కనుగొనేందుకు ఇస్రో అంగీకరించింది. ‘మేం రిసాట్ ద్వారా విమానాన్ని గుర్తిస్తాం. ఇది పగలు, రాత్రి కూడా పనిచేస్తుంది. దట్టమైన మేఘాల గుండా కూడా రాడార్ చిత్రాలకు సేకరిస్తుంది’ అని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ విమానంలోని బీకాన్ లైటునుంచి సంకేతాలేమీ రాలేదన్నారు.