Defense Minister parikar
-
ప్రతీకార దాడులు ఆపాలని పాక్ వేడుకుంది
రక్షణ మంత్రి పరీకర్ వెల్లడి న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ది అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు పట్టుకునే తీరని మరోసారి రుజువైంది. పాక్ సైన్యం గత మంగళవారం సరిహద్దుల్లో దాడులకు పాల్పడి భారత సైనికుడి తలను అత్యంత పాశవికంగా నరికి వేయడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత సైన్యం ఆ మరుసటి రోజు పూంచ్, రాజౌరి, కెల్, మచిల్ సెక్టార్లలో ఎల్వోసీ వెంబడి ఉన్న పాక్ పోస్టులపై భారీ మోర్టార్లతో దాడులు జరిపింది. దీంతో గుక్క తిప్పుకోలేకపోతున్న పాక్.. ప్రతీకార దాడులు వద్దంటూ భారత్‌ను వేడుకుంది. ఈ విషయాన్ని భారత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ శుక్రవారం గోవాలో తెలిపారు. ‘పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. దీంతో భయపడి ప్రతీకార దాడులను నిలిపేయాలని కోరుతూ పాక్ నుంచి మొన్న(బుధవారం) వేడుకోలు వచ్చింది’ అని ఆయన తెలిపినట్టు ఓ వార్తాసంస్థ పేర్కొంది. దాడులు చేయాలని తమకేమీ ఆసక్తి లేదని, అందువల్ల ఆపడానికి తమకేమీ అభ్యంతరం లేదని, అరుుతే ముందుగా కవ్వింపు చర్యలు ఆపాలని తాను పాక్‌కు సూచించినట్టు తెలిపారు. దీని ఫలితంగా గత రెండు రోజులుగా సరిహద్దు వెంబడి కాల్పులు ఆగిపోయాయన్నారు. పెద్దనోట్ల రద్దుతో తగ్గిన నేరాలు: పరీకర్ పణజి: పెద్దనోట్ల రద్దుతో ముంబైలో నేరాల రేటు దిగొచ్చిందని పరీకర్ చెప్పారు. హత్యలు, బలవంతపు వసూళ్లు గణనీయంగా తగ్గాయని తెలిపారు. శనివారం గోవాలోని ఆల్డోనాలో జరిగిన బీజేపీ సభలో మాట్లాడుతూ, ‘ తాను అధికార బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారును వదిలి సాధారణ కారునే వాడుతున్నానని, ధైర్యముంటే శత్రువులెవరైనా తనను షూట్ చేయవచ్చని పరీకర్ సవాల్ విసిరారు. -
జాడలేని విమానం
కొనసాగుతున్న గాలింపు - స్వయంగా సమీక్షించిన రక్షణ మంత్రి పరీకర్ -150 నాటికల్ మైళ్ల దూరంలో ఓ వస్తువు - అది విమాన శకలమా? కాదా? అని పరిశీలన చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై నుంచి బయలుదేరి అదృశ్యమైన ఏఎన్-32 వైమానిక దళ విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. 29 మందితో బంగాళాఖాతం మీదుగా పోర్టు బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం జాడ కనుగొనేందుకు వైమానిక, నౌకా దళాలు విస్తృతంగా అన్వేషిస్తున్నాయి. 18 నౌకాదళ, తీరరక్షక నౌకలు, ఓ జలాంతర్గామి, ఎనిమిది వాయుసేన విమానాలు (పీ 81, సీ130) గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. రెండు రోజులు గడుస్తున్నా విమానం జాడ తెలియకపోవటంతో బాధితుల కుటుంబాల్లో ఆందోళన పెరిగిపోతోంది. రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ శనివారం చెన్నై చేరుకుని.. గాలింపు చర్యలను స్వయంగా సమీక్షించారు. అనంతరం రెండు గంటలపాటు ఏరియల్ సర్వే చేశారు. వివిధ ప్రభుత్వ వనరులను వినియోగించుకుని విమానం జాడ కనుగొనేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. 24 గంటలుగా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆపరేషన్ జరుగుతున్న తీరును ఆయన ప్రశంసించారు. విమానంలో ఉన్న వారి కుటుంబాలతో నిరంతరం సంభాషిస్తూ వారికి కావాల్సిన సమాచారాన్ని అందజేయాలని కమాండర్లను ఆదేశించారు. అంతకుముందు.. అరక్కోణంలో నేవీ, వైమానిక అధికారులు మంత్రికి గాలింపు చర్యల గురించి వివరించారు. అనంతరం పీ-81 విమానంలో గాలింపు చర్యలు జరుగుతున్న తీరును ఆయన పర్యవేక్షించారు. ఏఎన్-32 విమానంతో సంబంధాలు తెగినట్టుగా భావిస్తున్న ప్రదేశం వరకు పర్యటించారు. తర్వాత అరక్కోణంలో నేవీ, వైమానిక దళం, కోస్టుగార్డులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎస్ఏఆర్ను మంత్రి సమీక్షించారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించినట్టు తెలిసింది. ఈ కమిటీ ప్రాథమిక విచారణ ప్రారంభించినట్టు సమాచారం. దీని పనితీరును మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఇందులో వైమానిక, నౌకాదళం వర్గాలతో పాటు, సాంకేతిక నిపుణుల్ని నియమించినట్టు తెలి సింది. ప్రమాదం జరిగే అవకాశ ఉందని భావిస్తున్న ప్రాంతంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్న నౌకాదళ అధికారి ఒకరు తెలిపారు. చెన్నైలోని తాంబరం ఎయిర్‌పోర్టునుంచి శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరిన రష్యా తయారీ ఏఎన్-32 వైమానిక దళ విమానానికి 16 నిమిషాల తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోవడం తెలిసిందే. ఆ వస్తువు విమాన శకలమా? చెన్నైకి 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఓ వస్తువు కనిపించిందని ప్రాథమిక సమాచారం అందింది. దీంతో అది విమాన శకలమా, కాదా? అనే విషయంలో ఆసక్తి నెలకొంది. వైమానిక దళం ఇచ్చిన సమాచారంతో ఆ పరిసరాల్లో గాలింపు తీవ్రంగా కొనసాగుతోంది. రంగంలోకి ఇస్రో: బంగాళాఖాతంలో గల్లంతైన వైమానిక దళ విమానం ఆచూకీ కనుక్కునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్రో సాయం కోరింది. దీంతో రిసాట్ (రాడార్ చిత్రాల ఉపగ్రహం) ద్వారా విమానం జాడ కనుగొనేందుకు ఇస్రో అంగీకరించింది. ‘మేం రిసాట్ ద్వారా విమానాన్ని గుర్తిస్తాం. ఇది పగలు, రాత్రి కూడా పనిచేస్తుంది. దట్టమైన మేఘాల గుండా కూడా రాడార్ చిత్రాలకు సేకరిస్తుంది’ అని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ విమానంలోని బీకాన్ లైటునుంచి సంకేతాలేమీ రాలేదన్నారు. -
‘అగస్టా’లో కీలక మలుపు
మధ్యవర్తి మిచెల్ కారు డ్రైవర్ విచారణలో వివరాల వెల్లడి న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల స్కాం విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కీలక ఆధారాలు సంపాదించింది. ఒప్పంద మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ కారు డ్రైవర్ నారాయణబహదూర్ను విచారించిన ఈడీకి కేసుకు సంబంధించిన కీలక వివరాలు దొరికాయి. మిచెల్‌కు భారతీయ అధికారులు, రాజకీయ నేతలతో ఉన్న సంబంధాల వివరాలు ఈడీ సంపాదించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి డ్రైవర్ నారాయణ బహదూర్‌కు డబ్బులు వచ్చేవని తెలిసింది. లావాదేవీలను విశ్లేషించటం ద్వారా మిచెల్‌కు ఏయే దేశాల్లో వ్యాపారాలున్నాయో స్పష్టత వస్తుందని ఈడీ భావిస్తోంది. ఢిల్లీలోని హోటల్నుంచి మిచెల్‌ను పికప్ చేసుకునే బహదూర్.. ఢిల్లీలోని భారత, విదేశీ సంస్థలు, వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లేవారు. దీంతో మిచెల్ ఎక్కడెక్కడ, ఎవరెవరిని కలిశారనే విషయాలు బయటపడనున్నాయి. సహకారానికి ప్రతిఫలం ఈ స్కాంలో ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు రిటైర్మెంట్ తర్వాత మంచి స్థానాలు(గవర్నర్లుగా, అంబాసిడర్లుగా) లభించాయని రక్షణ మంత్రి పరీకర్ చెప్పారు. నమ్మకంగా ఉన్నందుకే వీరందరికీ అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ పదవులు ఇచ్చిందన్నారు. అయితే.. వాజ్‌పేయి హయాంలో 2003లోనే అగస్టా ఒప్పందం కుదిరిందని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. కేసు విషయాన్ని కేవీ థామస్ నేతృత్వంలోని ప్రజాపద్దుల కమిటీ విచారించనుంది. -
‘అగస్టా’ విచారణ ‘బోఫోర్స్’లా సాగదు
పకడ్బందీగా ముందుకెళ్తాం: రక్షణ మంత్రి పరీకర్ న్యూఢిల్లీ: బోఫోర్స్ స్కాంలో మాదిరి కాకుండా అగస్టా వివాదంలో పకడ్బందీగా ముందుకెళ్తామని రక్షణమంత్రి పరీకర్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. ఈ కేసు విచారణలో ఇప్పటివరకు బయటపడ్డ ఎస్పీ త్యాగి, గౌతమ్ ఖైతాన్‌ల పాత్ర తక్కువేనన్నారు. లోక్‌సభలో సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ‘యూపీఏ హయాంలో, వారి సహకారంతోనే అగస్టాకు హెలికాప్టర్ డీల్ దక్కిందనేది వాస్తవం. త్యాగి, గౌతమ్ కేవలం గంగానది (అవినీతి) లో చేతులు మాత్రమే కడుక్కున్నారు. అసలు గంగ ఎక్కడికెళ్లిందో గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది’ అని అన్నారు. ఈ కుంభకోణంలో త్యాగి పాత్ర చాలా చిన్నదన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగాలన్న కాంగ్రెస్ డిమాండును పరీకర్ తోసిపుచ్చారు. సీబీఐ పక్కాగా విచారణ జరుపుతోందన్నారు. ఈ కేసుకు సంబంధించి నిజానిజాలు బయటకు రావటంలో సభ్యులంతా సహకరిస్తారని భావిస్తున్నానన్నారు. ఇటలీ కేంద్రంగా పనిచేసే అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీకి టెండరు దక్కితే.. లండన్ కేంద్రంగా పనిచేసే అగస్టా వెస్ట్‌లాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీకి డీల్ అప్పగించారన్నారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయటంతో.. ‘మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు. మీలో ఎవరి పేర్లు నేను చెప్పలేదు కదా!. మీ ఆందోళన చూస్తూంటే గంగ (ముడుపులు) ఎక్కడికెళ్లిందో మీకు తెలుసనిపిస్తోంది!’ అని పరీకర్ సమాధానమిచ్చారు. ఈ కేసులో ఏపీ, సిగ్నోరా పదాలకు అర్థమేంటో ప్రపంచమంతటికీ తెలుసని ఆ పేర్లను ప్రస్తావించి తన పేరు పాడుచేసుకోదలచుకోలేదన్నారు. 2012లో ఈ కుంభకోణం బయటపడినా 2014 వరకు దీనికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదన్నారు. ‘ఈ కేసులో ఆంటోనీ నిస్సహాయులుగా ఉండిపోయారని అర్థమవుతోంది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆయన చేతులు కట్టేశారు. ఫిన్మెకానికా కంపెనీ ఉన్నతాధికారి అరెస్టు అయిన తర్వాత రెండు, మూడు గంటల్లోపే ఈ కేసుకు సంబంధించిన ఫైల్‌ను ఆంటోనీ సీబీఐకి అప్పగించారు’ అనితెలిపారు. 2014 జూలై3న వైమానిక దళ కార్యాలయంలో అనుమానాస్పద అగ్నిప్రమాదంలో ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ కాలిపోయాయని అయితే 3 కీలక ఫైళ్లు వేరే అధికారి సొరుగులో ఉండటంతో వాస్తవాలు వెల్లడయ్యాయన్నారు. స్వామీ.. ఆధారాలేంటో చెప్పండి:అగస్టా వెస్ట్‌లాండ్ వివాదంలో కాంగ్రెస్ సభ్యులకు సంబంధాలున్నాయంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఏ ఆధారాలతో వ్యాఖ్యానించారో.. వాటిని సభముందు ప్రవేశపెట్టాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆదేశించారు. సరైన ఆధారాలు ఇవ్వని పక్షంలో స్వామి ఆరోపణలకు రికార్డులనుంచి తొలగిస్తామన్నారు. కాగా, సోనియా ఓ ఆడపులి అని ఆమెను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు. కాగా, అగస్టా కేసులో ఇటలీ కోర్టు తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌పై ఏం చేయాలో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. -
అదృశ్య ‘హస్తం’ అడ్డుకుంది
అగస్టా స్కాం విచారణపై రాజ్యసభలో పరీకర్ ♦ బ్లాక్మెయిల్ వద్దు.. స్వామిపై మండిపడ్డ ఆంటోనీ ♦ ఏపీ, సీపీ కోడ్ల ఆధారంగా విచారణా?: కాంగ్రెస్ న్యూఢిల్లీ: అగస్టాపై రాజ్యసభలో బుధవారం వాడి వేడి చర్చ జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి పరీకర్ వెల్లడించగా.. తమ పార్టీ సభ్యులపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడింది. అనుమానితులను సీబీఐ అదుపులోకి తీసుకుంటుందన్న బీజేపీ ఎంపీ స్వామి వ్యాఖ్యలపై మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేయగా.. కాంగ్రెస్ డిమాండును కేంద్రం తోసిపుచ్చింది. అటు లోక్‌సభలోనూ అగస్టాపై చర్చ వేడిపుట్టించింది. ఇటలీ కోర్టు వెల్లడించిన పేర్లపైనే.. అగస్టాతో ఒప్పందం పూర్తయ్యేంతవరకు యూపీఏ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిందని పరీకర్ రాజ్యసభలో తెలిపారు. ఇటాలియన్ కోర్టు నివేదికలో వెల్లడించిన పేర్లపైనే ప్రధానంగా విచారణ జరుగుతోందన్నారు. అగస్టా ఒప్పందానికి సంబంధించి 2005 నుంచి నెలకొన్న పరిణామక్రమాన్ని పరీకర్ రాజ్యసభకు వెల్లడించారు. మార్చి 12, 2013లో సీబీఐ కేసు నమోదు చేసినా.. ఎఫ్ఐఆర్ కాపీని ఈడీకి పంపలేదని.. ఆ తర్వాత ఈడీకి ఎఫ్ఐఆర్ అందినా జూలై 2014 వరకు స్పందించలేదని పరీకర్ చెప్పారు. 2012లోనే ఇదంతా జరిగేలా ఓ అదృశ్య హస్తం ప్రభావవంతంగా పనిచేసిందన్నారు. తన ప్రకటన ప్రారంభానికి ముందే ఎవరి పేర్లు తీసుకోనని పరీకర్ హామీ ఇచ్చారు. అంతకుముందు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మాట్లాడుతూ.. ‘ఈ కుంభకోణానికి మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి ఇచ్చిన వివరాల ప్రకారం ముడుపులు తీసుకున్న వారందరినీ సీబీఐ విచారిస్తుంది. అవసరమైతే అదుపులోకి తీసుకుంటుంది’ అని అన్నారు. స్వామి వ్యాఖ్యలపై మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తీవ్రంగా మండి పడ్డారు. ‘స్వామీజీ.. మీ దగ్గర ఆధారాలుంటే చర్యలు తీసుకోండి. అంతేకానీ మమ్మల్ని బెదిరించటమో.. బ్లాక్మెయిల్ చేయటమో చేయకండి. మమ్మల్ని రాజకీయంగా ఇబ్బందిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో మీరు గెలవలేరు’ అని అన్నారు. సభ మొదలైనప్పటినుంచీ రాజ్యసభ ప్రారంభం కాగానే.. అగస్టా వివాదానికి సంబంధించిన అంశాలను సభ ముందు ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని రక్షణమంత్రి పరీకర్ కోరగా.. విపక్షాలు ఆందోళన చేయటంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ తిరస్కరించారు. దీంతో బీజేపీ ఎంపీ భూపేంద్ర యాదవ్ ఈ అంశంపై చర్చను ప్రారంభిస్తూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. రక్షణరంగ ఒప్పందాల్లో పారదర్శకత లేకపోవటం ఆందోళనకరమన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ.. యూపీఏ సర్కారుపై అధికార పార్టీ ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. అప్పటి రక్షణమంత్రి ఆంటోనీ ఈ ఒప్పందాన్ని తిరస్కరించారన్నారు. సీపీ, వీపీ, ఏపీ వంటి కోడ్ సంకేతాలను పట్టుకుని కాంగ్రెస్‌పై విషప్రచారం చేస్తున్నారని.. హవాలా కుంభకోణంలో ‘ఎల్కేఏ’ అనే పదం తెరపైకి వచ్చినా ఆ తర్వాత హైకోర్టు దీనికి బీజేపీ అగ్రనేత అద్వానీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన విషయాన్ని మరిచిపోవద్దని గుర్తుచేశారు. కాగా, బుధవారం సమావేశాలకు ముందు అగస్టాపై రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేంద్ర మంత్రులతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అటు సోనియా కూడా పలువురు కీలక నేతలతో సమావేశమై అధికార పక్షానికి వ్యూహాత్మక సమాధానం ఇవ్వటంపై చర్చించారు. ‘బీజేపీ కొత్త ఆధారాలతో ముందుకు వస్తే స్వాగతిస్తాం’ అని సోనియా చెప్పారు.లోక్‌సభలోనూ అగస్టాపై దుమారం రేగింది. మంగళవారం ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ.. వివాదంలో తెరపైకి వచ్చిన గౌతమ్ ఖైతాన్, గుయ్‌డో హ్యాష్కీలు.. భారతదేశంలోని పలు కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్నారన్నారు. రాజ్యసభకు ప్రణవ్ పాండ్యా ఆల్ వరల్డ్ గాయత్రి పరివార్ అధ్యక్షుడు ప్రణవ్ పాండ్యాను మోదీ సర్కార్ రాజ్యసభకు నామినేట్ చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. త్యాగికి లంచాలు.. విచారణకు యూపీఏ సహకరించలేదు: ఇటలీ జడ్జి న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ కేసులోమాజీ వైమానిక అధికారి ఎస్పీ త్యాగి ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయని ఇటలీలో ఈ కేసుతీర్పిచ్చిన జడ్జి మార్కో మారియా మైగా బుధవారం తెలిపారు. ఈ విషయంలో దర్యాప్తు చేసేందుకు కావాల్సినన్ని ఆధారాలున్నాయన్నారు. విచారణకు యూపీఏ ప్రభుత్వం సహకరించలేదని వెల్లడించారు. ‘2002లో అగస్టాతో తొలిసారి ఒప్పందం కుదుర్చుకున్నప్పటినుంచి కేసు వివరాలివ్వాలని ఇటలీ అధికారులు, ప్రాసిక్యూటర్లు.. భారత అధికారులనుకోరారు. కానీ భారత్ అందించింది 3 డాక్యుమెంట్లే’ అని తెలిపారు. హెలికాప్టర్‌కు సంబంధించిన వివరాలు మార్చేందుకు మాజీ వైమానిక అధికారి ఎస్పీ త్యాగి, ఆయన సోదరులు ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయన్నారు. ఈ ఒప్పందానికి భారత ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం చేసిన గైడో హ్యస్కే చేతిరాతతో రాసిన దస్తావేజులో పలువురు భారత వైమానిక అధికారులు, బ్యూరోక్రాట్లతోపాటు రాజకీయ నేతల పేర్లున్నాయని మైగా చెప్పారు. మూడోరోజూ త్యాగిని ప్రశ్నించిన సీబీఐ.. ఈ కేసులో త్యాగిని సీబీఐ వరుసగా బుధవారం మూడో రోజు ప్రశ్నించింది.ఆయన న్యాయవాది, ఎయిరోమాట్రిక్ మాజీ బోర్డు సభ్యుడు గౌతమ్ ఖైతాన్‌ను కూడా ప్రశ్నించింది. వీరిని ఇటలీ ‘మధ్యవర్తులు’ కార్లో జారోసా, గైడో హాస్కేలతో సంబంధాలపై ప్రశ్నించారు.ఈ కేసులో నగదు లావాదేవీలపై గురువారం తమ ఎదుట హాజరై వివరాలివ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ త్యాగితో పాటు ఆయన బంధువులను ఆదేశించింది. హెలికాప్టర్ కుంభకోణంలో రియాల్టీ సంస్థ ఎమార్ ఎంజీఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రావణ్ గుప్తాను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సన్నిహితుడు కనిష్క సింగ్‌తో ఉన్న వ్యాపార సంబంధాల గురించీ ఆరాతీశారు. అలాగే, 2005లో ఢిల్లీలోని ఒక షాపింగ్‌మాల్‌లో రాహుల్‌కు రెండు షాపుల అమ్మకంపై ప్రశ్నించారు.