‘అగస్టా’ విచారణ ‘బోఫోర్స్’లా సాగదు
పకడ్బందీగా ముందుకెళ్తాం: రక్షణ మంత్రి పరీకర్
న్యూఢిల్లీ: బోఫోర్స్ స్కాంలో మాదిరి కాకుండా అగస్టా వివాదంలో పకడ్బందీగా ముందుకెళ్తామని రక్షణమంత్రి పరీకర్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. ఈ కేసు విచారణలో ఇప్పటివరకు బయటపడ్డ ఎస్పీ త్యాగి, గౌతమ్ ఖైతాన్‌ల పాత్ర తక్కువేనన్నారు. లోక్‌సభలో సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ‘యూపీఏ హయాంలో, వారి సహకారంతోనే అగస్టాకు హెలికాప్టర్ డీల్ దక్కిందనేది వాస్తవం. త్యాగి, గౌతమ్ కేవలం గంగానది (అవినీతి) లో చేతులు మాత్రమే కడుక్కున్నారు. అసలు గంగ ఎక్కడికెళ్లిందో గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది’ అని అన్నారు. ఈ కుంభకోణంలో త్యాగి పాత్ర చాలా చిన్నదన్నారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగాలన్న కాంగ్రెస్ డిమాండును పరీకర్ తోసిపుచ్చారు. సీబీఐ పక్కాగా విచారణ జరుపుతోందన్నారు. ఈ కేసుకు సంబంధించి నిజానిజాలు బయటకు రావటంలో సభ్యులంతా సహకరిస్తారని భావిస్తున్నానన్నారు. ఇటలీ కేంద్రంగా పనిచేసే అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీకి టెండరు దక్కితే.. లండన్ కేంద్రంగా పనిచేసే అగస్టా వెస్ట్‌లాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీకి డీల్ అప్పగించారన్నారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయటంతో.. ‘మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు. మీలో ఎవరి పేర్లు నేను చెప్పలేదు కదా!.
మీ ఆందోళన చూస్తూంటే గంగ (ముడుపులు) ఎక్కడికెళ్లిందో మీకు తెలుసనిపిస్తోంది!’ అని పరీకర్ సమాధానమిచ్చారు. ఈ కేసులో ఏపీ, సిగ్నోరా పదాలకు అర్థమేంటో ప్రపంచమంతటికీ తెలుసని ఆ పేర్లను ప్రస్తావించి తన పేరు పాడుచేసుకోదలచుకోలేదన్నారు. 2012లో ఈ కుంభకోణం బయటపడినా 2014 వరకు దీనికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదన్నారు. ‘ఈ కేసులో ఆంటోనీ నిస్సహాయులుగా ఉండిపోయారని అర్థమవుతోంది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆయన చేతులు కట్టేశారు. ఫిన్‌మెకానికా కంపెనీ ఉన్నతాధికారి అరెస్టు అయిన తర్వాత రెండు, మూడు గంటల్లోపే ఈ కేసుకు సంబంధించిన ఫైల్‌ను ఆంటోనీ సీబీఐకి అప్పగించారు’ అనితెలిపారు. 2014 జూలై3న వైమానిక దళ కార్యాలయంలో అనుమానాస్పద అగ్నిప్రమాదంలో ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ కాలిపోయాయని అయితే 3 కీలక ఫైళ్లు వేరే అధికారి సొరుగులో ఉండటంతో వాస్తవాలు వెల్లడయ్యాయన్నారు.
స్వామీ.. ఆధారాలేంటో చెప్పండి:అగస్టా వెస్ట్‌లాండ్ వివాదంలో కాంగ్రెస్ సభ్యులకు సంబంధాలున్నాయంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఏ ఆధారాలతో వ్యాఖ్యానించారో.. వాటిని సభముందు ప్రవేశపెట్టాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆదేశించారు. సరైన ఆధారాలు ఇవ్వని పక్షంలో స్వామి ఆరోపణలకు రికార్డులనుంచి తొలగిస్తామన్నారు. కాగా, సోనియా ఓ ఆడపులి అని ఆమెను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు. కాగా, అగస్టా కేసులో ఇటలీ కోర్టు తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌పై ఏం చేయాలో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు సుప్రీం కోర్టు ఆదేశించింది.