అదృశ్య ‘హస్తం’ అడ్డుకుంది
అగస్టా స్కాం విచారణపై రాజ్యసభలో పరీకర్
♦ బ్లాక్‌మెయిల్ వద్దు.. స్వామిపై మండిపడ్డ ఆంటోనీ
♦ ఏపీ, సీపీ కోడ్‌ల ఆధారంగా విచారణా?: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అగస్టాపై రాజ్యసభలో బుధవారం వాడి వేడి చర్చ జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి పరీకర్ వెల్లడించగా.. తమ పార్టీ సభ్యులపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడింది. అనుమానితులను సీబీఐ అదుపులోకి తీసుకుంటుందన్న బీజేపీ ఎంపీ స్వామి వ్యాఖ్యలపై మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేయగా.. కాంగ్రెస్ డిమాండును కేంద్రం తోసిపుచ్చింది. అటు లోక్‌సభలోనూ అగస్టాపై చర్చ వేడిపుట్టించింది.
ఇటలీ కోర్టు వెల్లడించిన పేర్లపైనే..
అగస్టాతో ఒప్పందం పూర్తయ్యేంతవరకు యూపీఏ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిందని పరీకర్ రాజ్యసభలో తెలిపారు. ఇటాలియన్ కోర్టు నివేదికలో వెల్లడించిన పేర్లపైనే ప్రధానంగా విచారణ జరుగుతోందన్నారు. అగస్టా ఒప్పందానికి సంబంధించి 2005 నుంచి నెలకొన్న పరిణామక్రమాన్ని పరీకర్ రాజ్యసభకు వెల్లడించారు. మార్చి 12, 2013లో సీబీఐ కేసు నమోదు చేసినా.. ఎఫ్‌ఐఆర్ కాపీని ఈడీకి పంపలేదని.. ఆ తర్వాత ఈడీకి ఎఫ్‌ఐఆర్ అందినా జూలై 2014 వరకు స్పందించలేదని పరీకర్ చెప్పారు. 2012లోనే ఇదంతా జరిగేలా ఓ అదృశ్య హస్తం ప్రభావవంతంగా పనిచేసిందన్నారు. తన ప్రకటన ప్రారంభానికి ముందే ఎవరి పేర్లు తీసుకోనని పరీకర్ హామీ ఇచ్చారు.
అంతకుముందు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మాట్లాడుతూ.. ‘ఈ కుంభకోణానికి మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి ఇచ్చిన వివరాల ప్రకారం ముడుపులు తీసుకున్న వారందరినీ సీబీఐ విచారిస్తుంది. అవసరమైతే అదుపులోకి తీసుకుంటుంది’ అని అన్నారు. స్వామి వ్యాఖ్యలపై మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తీవ్రంగా మండి పడ్డారు. ‘స్వామీజీ.. మీ దగ్గర ఆధారాలుంటే చర్యలు తీసుకోండి. అంతేకానీ మమ్మల్ని బెదిరించటమో.. బ్లాక్‌మెయిల్ చేయటమో చేయకండి. మమ్మల్ని రాజకీయంగా ఇబ్బందిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో మీరు గెలవలేరు’ అని అన్నారు.
సభ మొదలైనప్పటినుంచీ
రాజ్యసభ ప్రారంభం కాగానే.. అగస్టా వివాదానికి సంబంధించిన అంశాలను సభ ముందు ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని రక్షణమంత్రి పరీకర్ కోరగా.. విపక్షాలు ఆందోళన చేయటంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ తిరస్కరించారు. దీంతో బీజేపీ ఎంపీ భూపేంద్ర యాదవ్ ఈ అంశంపై చర్చను ప్రారంభిస్తూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. రక్షణరంగ ఒప్పందాల్లో పారదర్శకత లేకపోవటం ఆందోళనకరమన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ.. యూపీఏ సర్కారుపై అధికార పార్టీ ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. అప్పటి రక్షణమంత్రి ఆంటోనీ ఈ ఒప్పందాన్ని తిరస్కరించారన్నారు.
సీపీ, వీపీ, ఏపీ వంటి కోడ్ సంకేతాలను పట్టుకుని కాంగ్రెస్‌పై విషప్రచారం చేస్తున్నారని.. హవాలా కుంభకోణంలో ‘ఎల్‌కేఏ’ అనే పదం తెరపైకి వచ్చినా ఆ తర్వాత హైకోర్టు దీనికి బీజేపీ అగ్రనేత అద్వానీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన విషయాన్ని మరిచిపోవద్దని గుర్తుచేశారు. కాగా, బుధవారం సమావేశాలకు ముందు అగస్టాపై రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేంద్ర మంత్రులతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అటు సోనియా కూడా పలువురు కీలక నేతలతో సమావేశమై అధికార పక్షానికి వ్యూహాత్మక సమాధానం ఇవ్వటంపై చర్చించారు. ‘బీజేపీ కొత్త ఆధారాలతో ముందుకు వస్తే స్వాగతిస్తాం’ అని సోనియా చెప్పారు.లోక్‌సభలోనూ అగస్టాపై దుమారం రేగింది. మంగళవారం ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ.. వివాదంలో తెరపైకి వచ్చిన గౌతమ్ ఖైతాన్, గుయ్‌డో హ్యాష్‌కీలు.. భారతదేశంలోని పలు కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్నారన్నారు.
రాజ్యసభకు ప్రణవ్ పాండ్యా
ఆల్ వరల్డ్ గాయత్రి పరివార్ అధ్యక్షుడు ప్రణవ్ పాండ్యాను మోదీ సర్కార్ రాజ్యసభకు నామినేట్ చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
త్యాగికి లంచాలు.. విచారణకు యూపీఏ సహకరించలేదు: ఇటలీ జడ్జి
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ కేసులోమాజీ వైమానిక అధికారి ఎస్పీ త్యాగి ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయని ఇటలీలో ఈ కేసుతీర్పిచ్చిన జడ్జి మార్కో మారియా మైగా బుధవారం తెలిపారు. ఈ విషయంలో దర్యాప్తు చేసేందుకు కావాల్సినన్ని ఆధారాలున్నాయన్నారు. విచారణకు యూపీఏ ప్రభుత్వం సహకరించలేదని వెల్లడించారు. ‘2002లో అగస్టాతో తొలిసారి ఒప్పందం కుదుర్చుకున్నప్పటినుంచి కేసు వివరాలివ్వాలని ఇటలీ అధికారులు, ప్రాసిక్యూటర్లు.. భారత అధికారులనుకోరారు. కానీ భారత్ అందించింది 3 డాక్యుమెంట్లే’ అని తెలిపారు. హెలికాప్టర్‌కు సంబంధించిన వివరాలు మార్చేందుకు మాజీ వైమానిక అధికారి ఎస్పీ త్యాగి, ఆయన సోదరులు ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయన్నారు. ఈ ఒప్పందానికి భారత ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం చేసిన గైడో హ్యస్కే చేతిరాతతో రాసిన దస్తావేజులో పలువురు భారత వైమానిక అధికారులు, బ్యూరోక్రాట్లతోపాటు రాజకీయ నేతల పేర్లున్నాయని మైగా చెప్పారు.
మూడోరోజూ త్యాగిని ప్రశ్నించిన సీబీఐ..
ఈ కేసులో త్యాగిని సీబీఐ వరుసగా బుధవారం మూడో రోజు ప్రశ్నించింది.ఆయన న్యాయవాది, ఎయిరోమాట్రిక్ మాజీ బోర్డు సభ్యుడు గౌతమ్ ఖైతాన్‌ను కూడా ప్రశ్నించింది. వీరిని ఇటలీ ‘మధ్యవర్తులు’ కార్లో జారోసా, గైడో హాస్కేలతో సంబంధాలపై ప్రశ్నించారు.ఈ కేసులో నగదు లావాదేవీలపై గురువారం తమ ఎదుట హాజరై వివరాలివ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ త్యాగితో పాటు ఆయన బంధువులను ఆదేశించింది. హెలికాప్టర్ కుంభకోణంలో రియాల్టీ సంస్థ ఎమార్ ఎంజీఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రావణ్ గుప్తాను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సన్నిహితుడు కనిష్క సింగ్‌తో ఉన్న వ్యాపార సంబంధాల గురించీ ఆరాతీశారు. అలాగే, 2005లో ఢిల్లీలోని ఒక షాపింగ్‌మాల్‌లో రాహుల్‌కు రెండు షాపుల అమ్మకంపై ప్రశ్నించారు.