కేంద్రమంత్రులతో భేటీకానున్న కేసీఆర్
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేంద్రసింగ్ చౌదరి, పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడును ఆయన సోమవారం కలువనున్నారు.
8న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే 'నీతి ఆయోగ్' సమావేశంలో పాల్గొనేందుకు ఆయన గురువారం రాత్రి 11:30 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో 11 మంది కేంద్ర మంత్రులను కేసీఆర్ కలుస్తారని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు.
9వ తేదీ వరకు ఖరారైన అపాయింట్ల మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చౌదరి వీరేంద్రసింగ్, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాలను సీఎం కలుస్తారని సమాచారం అందించారు. ఆ మేరకు సోమవారం కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ చౌదరి, మరో మంత్రి వెంకయ్యనాయుడుని కలవనున్నారు. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు రాంవిలాస్‌పాశ్వాన్, సంతోష్ గంగ్వార్‌లను వారి అందుబాటునుబట్టి కలుసుకుంటారు. కేసీఆర్ గతంలో వివిధ మంత్రిత్వశాఖలకు ఇచ్చిన అర్జీలు, తెలంగాణ సమస్యలపై అందచేసిన దరఖాస్తుల్లోని అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం.