తిరువనంతపురం: గతేడాది డిసెంబర్ 31న చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన మహమ్మారి కరోనా వైరస్ నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కోవిడ్-19 జాడలు మనదేశంలో తొలిసారి బయటపడిన కేరళ కేసుల వివరాలను వెల్లడించింది. కొత్తగా మరో 12 కేసులు నమోదు కావడంతో.. ఏప్రిల్ 10 ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 357 కు చేరాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్విటర్ వేదికగా తెలిపారు. వారిలో 97 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారని వెల్లడించారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 258గా వివరించారు. రాష్ట్రంలో కేవలం 2 కరోనా మరణాలు మాత్రమే సంభవించాయని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,710 నమూనాలు టెస్ట్ చేశామని, కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా తిండిలేక ఇబ్బందులు పడుతున్న 28 లక్షల మందికి 1251 సామూహిక భోజన కేంద్రాల్లో ఆహారం అందించామని తెలిపారు. 3676 నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించామన్నారు. కాగా, 357 కేసులున్న కేరళ.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కేసులతో పోల్చుకుంటే 7 వ స్థానంలో ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1364 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. జనవరి 30 న కేరళలో తొలి పాజిటివ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment