కిందకు పడిపోతున్నాం.. పడిపోతున్నాం : లూబిడ్జ్
పారిస్: ' ఏదో రోజు నేను ఏదో ఒక పనిచేస్తా! ఆ పని మొత్తం వ్యవస్థనే మార్చేస్తుంది. ఆరోజు యావత్ ప్రపంచ ప్రజానీకానికి నా పేరు తెలుస్తుంది. వారు నన్నెప్పటికీ మరిచిపోలేరు' అని జర్మనీ విమానాన్ని ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉద్దేశపూర్వకంగా కూల్చేసిన కో పెలైట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఎప్పుడూ చెప్పేవాడని అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ శుక్రవారం రాత్రి జర్మన్ మీడియాకు తెలియజేసింది. అతని ప్రవర్తన సక్రమంగా ఉండేది కాదని, రాత్రిళ్లు పీడకలలు భయపెట్టినట్టుగా హులిక్కిపడి నిద్రలేచి ' పడిపోతున్నాం. కిందకు పడిపోతున్నాం' అంటూ అరిచేవాడని ఆమె చెప్పారు.
విమానం కూలిపోయిన వార్త తెలిసేంతవరకు అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కాలేదని ఆమె అన్నారు. తాను మానసిక వ్యాధితో బాధ పడుతున్నట్టు లూబిడ్జ్ తనకు ఎన్నడూ చెప్పలేదని, తానే తన అనుచిత ప్రవర్తనకు విసిగిపోయి అతన్ని వదిలేశానని ఆమె జర్మన్ వార్తా పత్రిక 'బ్లిండ్' కు వివరించారు. చట్ట నిబంధనల మేరకు ఆమె పేరును, పూర్తి వివరాలను ఆ పత్రిక వెల్లడించలేదు. డసెల్‌డార్ఫ్ శివారులోని ఓ ఇంట్లో లూబిడ్జ్‌తో కలిసి అతని గర్ల్ ఫ్రెండ్ ఏడేళ్లపాటు సహజీవనం చేసింది. వచ్చే ఏడాది వారిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇంతలోనే వారు విడిపోయారు. లూబిడ్జ్ ప్రవర్తన గురించి క్షున్నంగా తెలసుకునేందుకు అతని గర్ల్ ఫ్రెండ్‌ను జర్మనీ పోలీసులు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చు.