దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా వ్యాపారవేత్తగానే కాకుండా, గొప్ప మానవతావాదిగా.. ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే రతన్‌కు వైమానిక రంగంపై కూడా ఆసక్తి ఎక్కువే. ఆయన హెలికాప్టర్లు, విమానాలు నడిపే ఓ మంచి పైలట్ కూడా. వీటిని నడిపేందుకు లైసెన్స్ కూడా ఉంది.
2007లో ఆయనకు ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం వచ్చింది. 69 ఏళ్ల వయసులో ఫైటర్ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. 2007లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో అమెరికా రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ F-16 ఫైటర్ జెట్‌ను నడిపేందుకు ఆహ్వానం వచ్చింది. దీంతో రతన్ టాటా తొలిసారిగా యుద్ధ విమానాన్ని నడిపారు. అనుభవజ్ఞుడైన అమెరికా పైలట్ మార్గదర్శకత్వంలో కోపైలట్ రతన్ టాటా ఎఫ్-16లో గాల్లో దూసుకుపోయారు. దాదాపు అరగంట పాటు పూర్తిస్థాయిలో పైలట్‌గా విమానాన్ని నియంత్రిస్తూ ఎంజాయ్ చేశారు.
ఈ సమయంలో పైలట్ సాయంతో కొన్ని విన్యాసాలు కూడా చేశారు. ఓ సందర్భంలో వీరి విమానం భూమికి కేవలం 500 అడుగుల ఎత్తులో 600 నాట్స్ వేగంతో దూసుకుపోయింది. ఆయనకు ఓ రెప్లికాను కూడా లాక్‌హిడ్ గిఫ్ట్‌గా ఇచ్చింది. యుద్ధ విమానం నడపడం ఒళ్లు గగుర్పొడిచే అనుభవం అని ఆయన ఆ తరువాత మీడియాకు తెలిపారు. అంతేగాక యుద్ధ విమానం నడుపుతూ రతన్ టాటా ఎంతో థ్రిల్ అయ్యారని ఆయనను గైడ చేసిన లాక్‌హీడ్ మార్టిన్ పైలట్ కూడా చెప్పుకొచ్చారు.
అయితే, ఎఫ్-16ను నడిపిన మరుసటి రోజే రతన్ టాటా మరో యుద్ధ విమానంలో విహరించారు. ఎఫ్-16 కంటే శక్తిమంతమైన బోయింగ్ సంస్థకు చెందిన ఎఫ్ -18 హార్నెట్ యుద్ధ విమానంలో ఆయన గగనతలంలో విహరించారు. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ కార్యకలాపాలకు ఎఫ్ - 18 అప్పట్లో కీలకంగా ఉండేది. వైమానిక రంగంపై విశేషాసక్తి కనబరిచే రతన్ టాటాకు వరుసగా రెండుసార్లు యుద్ధ విమానాల్లో విహరించే అవకాశం రావడంతో తన కల నేరవేరినట్టు భావించారట. ఇదిలా ఉండగా దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి రతన్ టాటా హయాంలోనే మాతృ సంస్థకు చేరుకొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment