germanwings flight
-
మరో జర్మన్వింగ్స్ విమానానికి తప్పిన ముప్పు
కోపైలట్ దుశ్చర్యతో ఆల్ఫ్స్ పర్వతాల్లో విమానం కుప్పకూలి 150 మంది మరణించిన ఘటన మరువకముందే జర్మన్వింగ్స్ సంస్థకు చెందిన మరో విమానానికి భారీ ముప్పు తప్పింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం కొలోన్ నుంచి వెనిస్కు టేకాఫ్ అయిన ఎయిర్‌బస్ ఏ 319 విమానంలో ఆయిల్ లీక్ అవుతోందని పైలట్ భావించాడు. దీంతో విమానాన్ని దారి మళ్లించి నైరుతి జర్మనీలోని స్టట్గర్ట్ ఎయిర్ పోర్టులో దింపేశారు. ఆ సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. టెక్నికల్ ఇంజనీర్లు క్షుణ్ణంగా పరిశీలించి ఆయిల్ లీక్ కావడంలేదని తేల్చిచెప్పినప్పటికీ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా వారిని వేరొక విమానంలో వెనిస్కు తరలించినట్లు జర్మన్వింగ్స్ ప్రతినిధులు ప్రకటించారు. వరుస విమాన ప్రమాదాల నేపథ్యంలో జర్మన్వింగ్స్ ఫ్లయిట్లో ఆయిల్ లీకేజీ వార్త అటు అధికారులతోపాటు ఇటు ప్రయాణికుల కుటుంబాలనూ కలవరపాటుకు గురిచేసింది. -
సూసైడ్ కోసం కో పైలట్ ముందే ప్లాన్
బెర్లిన్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మనీ విమానాన్ని ఇటీవల కూల్చి 149 మంది ప్రయాణికుల మరణానికి కారణమైన కో పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ వారం రోజుల ముందు నుంచే ఎలా ఆత్మహత్య చేసుకోవాలి? విమానంలోని కాక్‌పిట్ డోర్లు ఎలా ఉంటాయి. దాని భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది ? అనే అంశాలపై ఇంటర్నెట్లో తీవ్రంగా సర్చ్ చేసినట్టు గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. లూబిడ్జ్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాబ్ కంప్యూటర్ ద్వారా ఈ విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయని జర్మనీ ప్రాసిక్యూటర్లు తెలిపారు. తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్న లూబిడ్జ్కి ‘లోరాజపమ్’ అనే బలమైన యాంటీ యాక్జైటీ డ్రగ్‌ను వాడాల్సిందిగా డాక్టర్లు సూచించినట్టు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్ తీసుకున్నట్టయితే సైకిల్, కారుతో సహా ఎలాంటి వాహనాన్ని నడపరాదని, విమానం అసలు నడపరాదని వైద్యులు సాధారణంగా సలహా ఇస్తారట. ఈ డ్రగ్‌ను వాడే కొత్తలో మానసిక రోగుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన తీవ్రంగా కలుగుతుందట. రానురాను తగ్గుతుందట. అలాగే ఈ డ్రగ్ వాడే రోగులకు కనీసం ఏడు గంటల ప్రశాంత నిద్ర అవసరమట. లోరాజపమ్ డ్రగ్‌ను వాడాల్సిందిగా లూబిడ్జ్కి సూచించిన డాక్టర్ కూడా కొంతకాలం సెలవు తీసుకోమని, విమానం అసలు నడపరాదని కూడా అతనికి సూచించారట. అయితే తాను సెలవులోనే ఉన్నానని, వీలైనంత త్వరగా కోలుకొని మళ్లీ విధుల్లో చేరాలనుకుంటున్నట్టు లూబిడ్జ్ వైద్యులతో అబద్ధాలేవాడని జర్మన్ వార్తా పత్రిక ‘బిల్డ్’ వెల్లడించింది. ఆల్ఫ్స్ పర్వతాల్లో మార్చి 24వ తేదీన కూలిపోయిన జర్మనీ విమానం (ఎయిర్‌బస్ 320ఏ) రెండం బ్లాక్ బాక్సు కూడా దొరికిందని, దాన్ని ఇంకా విశ్లేషించాల్సి ఉందని, అప్పుడు మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చని జర్మనీ ప్రాసిక్యూటర్లు గురువారం మీడియాకు తెలిపారు. -
కిందకు పడిపోతున్నాం.. పడిపోతున్నాం : లూబిడ్జ్
పారిస్: ' ఏదో రోజు నేను ఏదో ఒక పనిచేస్తా! ఆ పని మొత్తం వ్యవస్థనే మార్చేస్తుంది. ఆరోజు యావత్ ప్రపంచ ప్రజానీకానికి నా పేరు తెలుస్తుంది. వారు నన్నెప్పటికీ మరిచిపోలేరు' అని జర్మనీ విమానాన్ని ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉద్దేశపూర్వకంగా కూల్చేసిన కో పెలైట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఎప్పుడూ చెప్పేవాడని అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ శుక్రవారం రాత్రి జర్మన్ మీడియాకు తెలియజేసింది. అతని ప్రవర్తన సక్రమంగా ఉండేది కాదని, రాత్రిళ్లు పీడకలలు భయపెట్టినట్టుగా హులిక్కిపడి నిద్రలేచి ' పడిపోతున్నాం. కిందకు పడిపోతున్నాం' అంటూ అరిచేవాడని ఆమె చెప్పారు. విమానం కూలిపోయిన వార్త తెలిసేంతవరకు అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కాలేదని ఆమె అన్నారు. తాను మానసిక వ్యాధితో బాధ పడుతున్నట్టు లూబిడ్జ్ తనకు ఎన్నడూ చెప్పలేదని, తానే తన అనుచిత ప్రవర్తనకు విసిగిపోయి అతన్ని వదిలేశానని ఆమె జర్మన్ వార్తా పత్రిక 'బ్లిండ్' కు వివరించారు. చట్ట నిబంధనల మేరకు ఆమె పేరును, పూర్తి వివరాలను ఆ పత్రిక వెల్లడించలేదు. డసెల్డార్ఫ్ శివారులోని ఓ ఇంట్లో లూబిడ్జ్తో కలిసి అతని గర్ల్ ఫ్రెండ్ ఏడేళ్లపాటు సహజీవనం చేసింది. వచ్చే ఏడాది వారిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇంతలోనే వారు విడిపోయారు. లూబిడ్జ్ ప్రవర్తన గురించి క్షున్నంగా తెలసుకునేందుకు అతని గర్ల్ ఫ్రెండ్‌ను జర్మనీ పోలీసులు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చు. -
గర్ల్ ఫ్రెండ్ కాదనడంతో.. విమానం కూల్చేశాడు!!
ఆ కో-పైలట్ ఓ మానసిక రోగి ముందురోజు వరకు కౌన్సెలింగ్ గతంలోనూ సైకో థెరపీ తీసుకున్నాడు జర్మనీ వార్తాపత్రిక 'బిల్డ్' వెల్లడి పారిస్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్సా పర్వతాల్లో 'ఎయిర్‌బస్ ఏ-320' విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి 150 మందిని పొట్టన పెట్టుకున్న జర్మనీ వింగ్స్ కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ మానసిక రోగి అని, విమానాన్ని కూల్చేసిన రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కౌన్సెలింగ్ తీసుకున్నాడని ప్రముఖ జర్మనీ వార్తా పత్రిక 'బిల్డ్' శుక్రవారం వెల్లడించింది. బాత్రూమ్కు వెళ్లిన పైలట్‌ను తిరిగి కాక్‌పిట్‌లోకి రాకుండా క్యాబిన్ డోర్‌ను లాక్ చేసి విమానాన్ని తలకిందులుగా తీసుకెళ్లి పర్వతాల్లో కో-పైలట్ లూబిడ్జ్ కూల్చేసినట్టు గురువారం ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్ వెల్లడించిన విషయం తెల్సిందే. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న గర్ల్ ఫ్రెండ్, రెండు వారాల క్రితం అభిప్రాయ భేదాలొచ్చి తనతో విడిపోయిందని, అప్పటి నుంచి ఆయన మానసిక జబ్బు మళ్లీ తిరగతోడిందని, అందుకోసం సైకో థెరపీ కింద కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడని ఆ పత్రిక పేర్కొంది. తీవ్ర మనస్తాపంతో రగిలిపోతున్న టూబిడ్జ్ విమానాన్ని కూల్చేయడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. 28 ఏళ్ల లూబిడ్జ్ 2008లో పైలట్ శిక్షణ సందర్భంగా కొన్ని నెలలపాటు సెలవు తీసుకొని మానసిక జబ్బుకు సైకో థెరపి తీసుకున్న విషయం కూడా ఈరోజే వెలుగులోకి వచ్చింది. విమాన ప్రమాద సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారుల బృందం గురువారం నాడు నాలుగు గంటలపాటు మోంటబార్‌లోని కో-పైలట్ లూబిడ్జ్ ఫ్లాట్‌ను శోధించగా ఓ గర్ల్ ఫ్రెండ్‌తో వ్యవహారం ఉన్నట్టు, మానసిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. పైలట్ శిక్షణ సందర్బంగా కొన్ని నెలలపాటు లూబిడ్జ్ సెలవుపై వెళ్లినట్టు ధ్రువీకరించిన లుఫ్తాన్సా విమానయాన సంస్థ హెడ్ కార్స్టెన్ స్పార్.. అతడి మానసిక వ్యాధి విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరపున అమెరికాలోని ఆరిజోనాలో పైలట్ శిక్షణ పొందిన లూబిడ్జ్ ఏకంగా ఏడాది పాటు మానసిక వ్యాధికి సైకో థెరపీ తీసుకున్నాడని తెల్సింది. అయితే అన్ని పరీక్షలతోపాటు, మానసిక పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడయ్యాకే ఆయన్ని పైలట్‌గా ఎంపిక చేశామని కార్స్టెన్ స్పార్ తెలిపారు. లూబిడ్జ్ నివాసంలో దొరికిన పత్రాల ప్రకారం విమాన ప్రమాదం జరిగిన ముందు రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కో-పైలట్ కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడు. విమానం ఎక్కే సందర్భాల్లో కూడా డాక్టర్ సలహా తీసుకున్నాకే విమానాన్ని నడపాల్సి ఉంటుందని కూడా ఆయనకు వైద్యం చేస్తున్న సైకాలజిస్ట్ సూచించారు. 'ఓ పాఠశాల లేదా సైనిక క్యాంప్‌పై దాడిచేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఎంతో మంది ప్రాణాలుతీసి తాను ఆత్మహత్య చేసుకునే మానసిక వ్యాధిగ్రస్థుడిలాగా లూబిడ్జ్ ప్రవర్తన కనిపిస్తోంది' అని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ సైకాలాజీ ప్రొఫెసర్ క్రేగ్ జాక్సన్ వ్యాఖ్యానించారు.