స్టట్గర్ట్ ఎయిర్పోర్టులో జర్మన్వింగ్స్ విమానం నుంచి బయటికి వస్తోన్న ప్రయాణికులు
కోపైలట్ దుశ్చర్యతో ఆల్ఫ్స్ పర్వతాల్లో విమానం కుప్పకూలి 150 మంది మరణించిన ఘటన మరువకముందే జర్మన్వింగ్స్ సంస్థకు చెందిన మరో విమానానికి భారీ ముప్పు తప్పింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం కొలోన్ నుంచి వెనిస్కు టేకాఫ్ అయిన ఎయిర్బస్ ఏ 319 విమానంలో ఆయిల్ లీక్ అవుతోందని పైలట్ భావించాడు.
దీంతో విమానాన్ని దారి మళ్లించి నైరుతి జర్మనీలోని స్టట్గర్ట్ ఎయిర్ పోర్టులో దింపేశారు. ఆ సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. టెక్నికల్ ఇంజనీర్లు క్షుణ్ణంగా పరిశీలించి ఆయిల్ లీక్ కావడంలేదని తేల్చిచెప్పినప్పటికీ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా వారిని వేరొక విమానంలో వెనిస్కు తరలించినట్లు జర్మన్వింగ్స్ ప్రతినిధులు ప్రకటించారు. వరుస విమాన ప్రమాదాల నేపథ్యంలో జర్మన్వింగ్స్ ఫ్లయిట్లో ఆయిల్ లీకేజీ వార్త అటు అధికారులతోపాటు ఇటు ప్రయాణికుల కుటుంబాలనూ కలవరపాటుకు గురిచేసింది.