సూసైడ్ కోసం కో పైలట్ ముందే ప్లాన్
బెర్లిన్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మనీ విమానాన్ని ఇటీవల కూల్చి 149 మంది ప్రయాణికుల మరణానికి కారణమైన కో పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ వారం రోజుల ముందు నుంచే ఎలా ఆత్మహత్య చేసుకోవాలి? విమానంలోని కాక్‌పిట్ డోర్లు ఎలా ఉంటాయి. దాని భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది ? అనే అంశాలపై ఇంటర్నెట్‌లో తీవ్రంగా సర్చ్ చేసినట్టు గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
లూబిడ్జ్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాబ్ కంప్యూటర్ ద్వారా ఈ విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయని జర్మనీ ప్రాసిక్యూటర్లు తెలిపారు. తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్న లూబిడ్జ్‌కి ‘లోరాజపమ్’ అనే బలమైన యాంటీ యాక్జైటీ డ్రగ్‌ను వాడాల్సిందిగా డాక్టర్లు సూచించినట్టు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్ తీసుకున్నట్టయితే సైకిల్, కారుతో సహా ఎలాంటి వాహనాన్ని నడపరాదని, విమానం అసలు నడపరాదని వైద్యులు సాధారణంగా సలహా ఇస్తారట.
ఈ డ్రగ్‌ను వాడే కొత్తలో మానసిక రోగుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన తీవ్రంగా కలుగుతుందట. రానురాను తగ్గుతుందట. అలాగే ఈ డ్రగ్ వాడే రోగులకు కనీసం ఏడు గంటల ప్రశాంత నిద్ర అవసరమట. లోరాజపమ్ డ్రగ్‌ను వాడాల్సిందిగా లూబిడ్జ్‌కి సూచించిన డాక్టర్ కూడా కొంతకాలం సెలవు తీసుకోమని, విమానం అసలు నడపరాదని కూడా అతనికి సూచించారట. అయితే తాను సెలవులోనే ఉన్నానని, వీలైనంత త్వరగా కోలుకొని మళ్లీ విధుల్లో చేరాలనుకుంటున్నట్టు లూబిడ్జ్ వైద్యులతో అబద్ధాలేవాడని జర్మన్ వార్తా పత్రిక ‘బిల్డ్’ వెల్లడించింది.
ఆల్ఫ్స్ పర్వతాల్లో మార్చి 24వ తేదీన కూలిపోయిన జర్మనీ విమానం (ఎయిర్‌బస్ 320ఏ) రెండం బ్లాక్ బాక్సు కూడా దొరికిందని, దాన్ని ఇంకా విశ్లేషించాల్సి ఉందని, అప్పుడు మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చని జర్మనీ ప్రాసిక్యూటర్లు గురువారం మీడియాకు తెలిపారు.