డీడీసీఏపై కమిషన్ చట్టవిరుద్ధం
ఢిల్లీ సర్కారుకు హక్కు లేదన్న కేంద్రం
♦ కమిషన్‌కు చట్టబద్ధత లేదని లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ
♦ అభ్యంతరాలుంటే కోర్టుకెళ్లండి.. విచారణ కొనసాగుతుంది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య మళ్లీ ‘డీడీసీఏ’ వివాదం రాజుకుంది. డీడీసీఏ అవినీతి కేసులో విచారణకు ఢిల్లీ ప్రభుత్వం మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం నేతృత్వంలో దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేయటం రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం నిర్ణయించింది. ఢిల్లీ సర్కారు కమిటీని ఏర్పాటు చేయటం.. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం(1952) లోని సెక్షన్ 2,3 ప్రకారం.. న్యాయ విరుద్ధమని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి ఢిల్లీ సర్కారుకు లేఖ అందింది. ఢిల్లీ ప్రభుత్వం పూర్తిస్థాయి రాష్ట్ర ప్రభుత్వం కానందువల్ల దర్యాప్తు కమిషన్‌ను నియమిస్తూ ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డెరైక్టరేట్ ఇచచిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని హోం మంత్రిత్వ శాఖ భావించింది కనుక.. దర్యాప్తు కమిషన్‌కు చట్టబద్దత లేదని పేర్కొంది.
రాజ్యాంగంలోని 239, 239 ఏఏ అధికారణల ప్రకారం.. ఆగస్టు 1966లో భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు జనరల్ క్లాసెస్ చట్టం నిబంధనల ఆధారంగా ఢిల్లీ ప్రభుత్వానికి దర్యాప్తు కమిషన్ నియమించే అధికారం లేదని తెలిపింది. కాగా, ఎట్టిపరిస్థితుల్లోనూ విచారణ ముందుకు సాగుతుందని.. సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చట్టం, న్యాయ పరిధిలోనే కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం, హోం శాఖ, లెఫ్టినెంట్ గవర్నర్‌లకు అభ్యంతరాలుంటే.. కోర్టును సంప్రదించవచ్చన్నారు. ‘గతేడాది డిసెంబర్ 22న ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగానే కమిటీ వేశాం.
ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి తలొగ్గి పనిచేయాల్సిన అవసరం లేదు. విచారణ కొనసాగుతుంది’ అని ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా కేంద్రంపై తీవ్రంగా విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కాపాడేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందన్నారు. ఢిల్లీ సీఎంవోపై సీబీఐ దాడులు జరగటంతో.. ఆప్ సర్కారు డీడీసీఏ అక్రమాలను తెరపైకి తెచ్చి నేరుగా ప్రధానిపైనే ఆరోపణలు చేసి, కమిషన్ వేయడం తెలిసిందే. కాగా, కేజ్రీవాల్ ఒకదాని తర్వాత ఒకటిగా రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. జైట్లీ పరువునష్టం కేసులో కేజ్రీ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.
ఒకే వేదికపై జైట్లీ, కేజ్రీవాల్: కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమిట్‌లో జైట్లీ, కేజ్రీవాల్ ఒకే వేదికను పంచుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరైనా సదస్సు జరుగుతున్నంతసేపు సదస్సుకు హాజరైన వారి దృష్టంతా వీరిపైనే ఉంది.