సంయమనం పోయింది
♦ మోదీ సర్కారుపై సోనియా ధ్వజం
♦ జేఎన్‌యూ వివాదాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాం
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా సంయమనం కోల్పోయిందని.. జేఎన్‌యూ వివాదంలో ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ధ్వజమెత్తారు. సోమవారమిక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ప్రసంగిస్తూ.. ‘‘శోధన స్ఫూర్తిని, ప్రశ్నించే, చర్చించే స్ఫూర్తిని, అసమ్మతి స్ఫూర్తిని ధ్వంసం చేసేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో మన గొంతు నొక్కింది. ఇప్పుడు ఆ పరిస్థితి వర్సిటీలకూ వచ్చింది’ అని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు.
అనంతరం సీడబ్ల్యూసీ ప్రకటన చేస్తూ.. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామిక సూత్రాలపై ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని పేర్కొంది. ఒక ఉన్నత విద్యా సంస్థ (జేఎన్‌యూ)లో జరిగిన ఉదంతం, అటువంటి విద్యా సంస్థల్లో జరిగిన ఘటనలు, దేశ రాజధానిలో ఒక కోర్టులో జరిగిన హింస, దౌర్జన్యం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయంది. అది భావప్రకటనా స్వేచ్ఛ, విభేదించే స్వాతంత్య్రంపై ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిగా అభివర్ణించింది. ప్రభుత్వ వైఫల్యాలను, విద్యార్థుల నిరసనలపై తన దౌర్జన్యపూరిత వైఖరిని కప్పిపుచ్చేందుకు.. బూటకపు వార్తా క్లిప్పుల ద్వారా దేశభక్తి, జాతీయవాదంపై కృత్రిమ చర్చను పుట్టిస్తున్నారంది. మంగళవారం నుంచి మొదలుకానున్న పార్లమెంటు సమావేశాల్లో భావసారూప్య పార్టీలతో కలిసి ఈ అంశాలను లేవనెత్తుతామని స్పష్టంచేసింది.