ఎస్పీ నేత అజం ఖాన్‌పై కేసులు నమోదు
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజం ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై హజ్‌రత్ జంగ్, రాంపూర్ సివిల్ లైన్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయి. సైనికుల మనోభావాలను దెబ్బతినే విధంగా అజం ఖాన్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు.
కాగా మహిళలపై అకృత్యాలకు తెగబడే సైనికులపై తిరగబడాలని, సైనిక రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని, వారి మర్మవయాలు కోసి పాడేయాలంటూ ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘కశ్మీర్, జార్ఖండ్, అస్సోంలో అకృత్యాలకు పాల్పడిన సైనికులను మహిళలు చితక్కొట్టాలి. వారి గుప్తవయవాలను ఖండించాలి. ఆర్మీ రేపిస్టులకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలి’ అంటూ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు తాను భారత సైన్యాలను కించపరిచేవిధంగా మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు.