సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో నూతనోత్సాహం నింపుకున్న కాంగ్రెస్ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాలక బీజేపీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ గురువారం లోక్‌సభ, రాజ్యసభలో రాఫేల్ ఒప్పందంపై వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టింది.
ఆప్ సైతం రాఫేల్ ఒప్పందంపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. మరోవైపు పార్లమెంట్‌లో విపక్షాల దాడిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే అంశంపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. ఈ భేటీకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా ఈ భేటీలో ప్రస్తావించారు. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 46 బిల్లులను ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ యోచిస్తుండటంతో ఈ దిశగా కసరత్తును బీజేపీ ముమ్మరం చేసింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరిపై ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా పార్టీ సభ్యులకు మార్గనిర్ధేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment