పతనంతిట్ట: ప్రజలు తమ నమ్మకాలను, మనోభావాలను వ్యక్తపరిచేందుకు తాము అనుమతిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలో అన్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకోవాలని బీజేపీ చూస్తున్న తరుణంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే తన ప్రసంగంలో రాహుల్ ఎక్కడా శబరిమల అంశాన్ని నేరుగా ప్రస్తావించలేదు. శబరిమల అంశానికి సంబంధించి ఆందోళనలు మొదలైన పతనంతిట్టలో రాహుల్ మంగళవారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. మనసులో ఉన్న దానిని ప్రజలు బయటపెట్టగలిగే స్వేచ్ఛ ఉన్న దేశాన్ని తమ పార్టీ కోరుకుంటోందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తుండటం తెలిసిందే.
ఇతర ప్రజల నమ్మకాలను కేరళ గౌరవిస్తుంది కాబట్టి తాను పోటీ చేసేందుకు వాయనాడ్‌ను ఎంచుకున్నట్లు రాహుల్ తెలిపారు. అనంతరం కొల్లాం జిల్లాలోనూ రాహుల్ ప్రచారం నిర్వహించారు. అక్కడ మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్‌ల చేతిలో దేశం దాడికి గురవుతోందనీ, తమకు వ్యతిరేక గొంతుక దేశంలో వినిపించకూడదని వారు అనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. దేశ పాలన ప్రజల చేతిలో ఉండాలి కానీ ఒక వ్యక్తి లేదా ఒక సిద్ధాంతం చేతిలో కాదని అన్నారు. గతవారం మరణించిన కేరళ కాంగ్రెస్ (ఎం) నాయకుడు కేఎం మణి కుటుంబసభ్యులను రాహుల్ పరామర్శించారు. మణి కేరళలో ప్రముఖ నాయకుల్లో ఒకరనీ, కేరళ ప్రజల పక్షాన ఆయన ఎంతో పోరాడారని రాహుల్ గుర్తుచేసుకున్నారు. కాగా, వాయనాడ్‌లో రాహుల్ బుధవారం ప్రచారం చేయనున్నారు.
రాహుల్ ‘అపరిమిత అవివేకి’:ఎస్‌ఎం కృష్ణ
బెంగళూరు: రాహుల్ గాంధీ ‘అప్రబుద్ధ అన్‌లిమిటెడ్’(అపరిమిత అవివేకి) అంటూ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ విమర్శించారు. రఫేల్ కేసుకు సంబంధించి రాహుల్ సొంతంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆ విషయాలను సుప్రీంకోర్టే చెప్పిందని ప్రసంగాల్లో పేర్కొనడం, అనంతరం కోర్టు రాహుల్‌కు మొట్టికాయలు వేయడం తెలిసిందే. దీనిపై కృష్ణ మాట్లాడుతూ ‘ఎవరైనా ఓ పెద్ద పదవికి చేరుకున్నప్పుడు, ప్రత్యేకించి 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నవారు, ఏదైనా మాట్లాడేటప్పుడు ఎంతో ఆలోచించుకోవాలి. అది పరిణతికి చిహ్నం. కానీ ఈరోజు మనం చూస్తున్న వ్యక్తి అపరిమిత అవివేకి’ అని ఎస్‌ఎం కృష్ణ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment