కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు
మహారాష్ట్రలో నారాయణ్ రాణే, అస్సాంలో హిమంత శర్మ రాజీనామా
ముంబై/గువాహటి: లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా రెండు రాష్ట్రాల్లో స్వపక్ష నేతలు పెద్ద షాకిచ్చారు. ఆ పార్టీ పాలనలోని మహారాష్ట్ర, అస్సాంలలో ఇద్దరు అసమ్మతి సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రులపై తిరుగుబాటు చేశారు. మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే, అస్సాం ఆరోగ్య, విద్యా మంత్రి హిమంత బిశ్వాస్ శర్మలు తమ సీఎంల పనితీరుపై అసంతృప్తితో సోమవారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. కొన్ని నెలల కింద కూడా రాజీనామా చేసిన వీరు.. అప్పుడు అధిష్టానంఒత్తిడితో ఉపసంహరించుకున్నారు. అయితే ఈసారి ఉపసంహరించుకోనని, శర్మ స్పష్టం చేశారు.
నారాయణ్ రాణే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కలుసుకుని రాజీనామా అందజేశారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. ‘2005లో కాంగ్రెస్‌లో చేరినప్పుడు తనను ఆరు నెలల్లో ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన అధిష్టానం తొమ్మిదేళ్లవుతున్నా దాన్ని నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. తాను పార్టీని వీడనని స్పష్టం చేశారు. మరోపక్క తనకు మద్దతిస్తున్న 38 మంది ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ వద్దకు వెళ్లానని, సీఎం గొగోయ్ నాయకత్వంపై అవిశ్వాసం వ్యక్తం చేశానని హిమంత శర్మ తెలిపారు. తాము పార్టీ కోసం పోరాడుతున్నామని, గొగోయ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఘోరంగా దెబ్బతింటుందన్నారు.