'మోదీని దేవుడిగా భావిస్తున్నారు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నరేంద్ర మోదీ ఫోబియాను వ్యాపింపజేస్తోందని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆరోపించారు. దేశంలో కరువు వచ్చినందుకు మోదీ ప్రభుత్వాన్ని నిందిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు మోదీని దేవుడిగా భావిస్తున్నారేమో కానీ ఏదో ఒకరోజు కరువుకు కూడా ఆయనే కారణమని చెబుతారని లేఖి ఘాటైన విమర్శలు చేశారు. 65 ఏళ్లకు దేశానికి అసమర్థపాలన అందించిన కాంగ్రెస్ పార్టీ కరువుకు, నీటి ఎద్దడికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 'కరువుకు వాటర్ మేనేజ్మెంట్లోని లోపమే కారణం. నదులు పుష్కలంగా ఉన్న ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా కరువుతో సతమతమవుతున్నాయి. గతంలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారు. వారి అవినీతిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. తప్పు చేసిన కాంగ్రెస్ నాయకులకు కష్టాలు తప్పవు' అని మీనాక్షి లేఖి అన్నారు.