
ఎమ్మెల్యే కాళ్లకు మొక్కిన కిరణ్ బేడి!
పుదుచ్చేరి: ఆమె ఎక్కడున్నా తన ప్రత్యేకత చాటుకుంటారు. తొలి మహిళా ఐపీఎస్ గా ఘనత సాధించిన కిరణ్ బేడి తన ఉద్యోగ జీవితంలోనూ తనదైన ముద్ర వేశారు. తాజాగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఈ మాజీ ఐపీఎస్ తన మార్క్ చూపిస్తున్నారు. ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాను బాధ్యతలు చేపట్టిన సందర్బంగా పుదుచ్చేరి ఎమ్మెల్యేలు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే విజయవేణి... కిరణ్ బేడికి సాలువా కప్పి పాదాభివందనం చేసింది. ఆమెను లేవదీసి కాళ్లు పట్టుకోవద్దని కిరణ్ బేడి ఉపదేశించారు. ఆత్మగౌరవంతో బతకాలని ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. అక్కడితో ఆగకుండా మహిళా ఎమ్మెల్యేకు తాను కూడా పాదాభివందనం చేశారు. దీంతో మహిళా ఎమ్మెల్యేతో పాటు అక్కక ఉన్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచారం చేస్తోంది.
లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కిరణ్ బేడి తనదైన శైలి చూపించారు. వీఐపీలు, రాజకీయ నేతల కార్లకు ఎలాంటి సైరన్లు ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రాజకీయ నేతలకు మినహాయింపు ఇవొద్దని ఆదేశించారు. పుదుచ్చేరిని క్లీన్ సిటీగా మార్చేందుకు అందరూ సహకరించాలని కిరణ్ బేడి పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నగరంలోని పరిసరాలను పరిశుభ్రం చేశారు.