
సోనియా తండ్రి 'ఫాసిస్టు సైనికుడు'!
ఆవిర్భావ దినోత్సవం నాడే కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఎదురైంది.
న్యూఢిల్లీ: ఆవిర్భావ దినోత్సవం నాడే కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఎదురైంది. సాక్షాత్తూ సొంత పత్రికలోనే పార్టీ తాజా, మాజీ అధినేతలపై విమర్శలు చేస్తూ వ్యాసాలు వెలువడటం కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. 'కాంగ్రెస్ దర్శన్' పత్రికలో దేశ మొదటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ దిగ్గజ నేత జవహర్‌లాల్ నెహ్రూపైనే కాదు.. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీపైనా తీవ్ర ఆరోపణలు ప్రచురితమయ్యాయి. సోనియాగాంధీ తండ్రి ఓ ఫాసిస్టు సైనికుడంటూ ఆరోపణలు పత్రికలో దర్శనమివ్వడం కాంగ్రెస్ నేతల్ని బిత్తరపోయేలా చేసింది.
సోనియా తండ్రి ఇటాలియన్ ఫాసిస్టు సైన్యంలో సభ్యుడని, ప్రపంచయుద్ధంలో రష్యా చేతిలో ఈ సైన్యం ఓడిపోయిందని 'కాంగ్రెస్ దర్శన్'లో పేరు లేకుండా వెలువడిన ఓ వ్యాసం పేర్కొంది. సోనియా తండ్రి స్టెఫానో మైనో మాజీ ఫాసిస్టు సైనికుడని తెలిపింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ అతి తక్కువకాలంలో అధ్యక్షురాలిగా ఎదిగారని వ్యాఖ్యానించింది. రాజకీయాల్లోకి రాముందు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. సోనియా ఒకప్పుడు ఎయిర్‌హోస్టెస్ కావాలనుకున్నారని వ్యాసంలో పేర్కొంది.
'1997లో కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా నమోదైన సోనియాగాంధీ కేవలం 62 రోజుల్లోనే పార్టీ అధ్యక్షురాలిగా మారారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె కొన్ని విఫలయత్నాలు చేశారు' అని ఈ వ్యాసం పేర్కొంది. 'కాంగ్రెస్ దర్శన్' ముంబై యూనిట్ పత్రికలో కశ్మీర్, చైనా, టిబెట్ విషయంలో తొలి ప్రధాని నెహ్రూ అనుసరించిన విధానాన్ని తప్పుపడుతూ వ్యాసం వెలువడిన సంగతి తెలిసిందే. జాతీయ కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవంగా పార్టీ అధికార పత్రికలో వచ్చిన ఈ వ్యాసాలతో ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ పార్టీ 'కాంగ్రెస్ దర్శన్' కంటెంట్ ఎడిటర్ సుదీప్ జోషిపై వేటు వేసింది.