
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం దేశవ్యాప్త ఆందోళనను చేపట్టనుంది. పెంచిన పెట్రో ధరలను వెనక్కితీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించనున్నారు. కరోనా సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్ ధరలను అనాలోచితంగా పెంచడం పట్ల నిరసన తెలుపుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో పెట్రో ధరల పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై అసాధారణ భారం మోపినతీరును ఎండగడతామని చెప్పారు.
ఇక జూన్ 30 నుంచి వారం రోజుల పాటు తాలూకా, బ్లాక్ స్ధాయిలో భారీ నిరసనలు చేపడతామని వెల్లడించారు. గత 21 రోజులుగా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యులపై అదనపు భారం మోపుతోందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయిన క్రమంలో కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు పెంచి భారీగా దండుకుంటోందని దుయ్యబట్టారు. పెట్రో ధరలు తగ్గినా వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ప్రజలకు ఉద్దేశపూర్వకంగానే ఉపశమనం కలిగించడంలేదని ఆరోపించారు.