సాక్షి, న్యూఢిల్లీ : వలస కార్మికుల తరలింపునకు లాక్‌డౌన్ ముగుస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అనుమతించడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా లక్షలాది వలస కార్మికులు చిక్కుకుపోయారని పేర్కొంది. పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు రైళ్లలో తరలించడం మేలని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి అన్నారు. వివిధ రాష్ట్రాల్లో లక్షలాది మంది వలస కూలీలు చిక్కుకుపోయారని వారిని బస్సుల్లో తరలిస్తే ఈ ప్రక్రియ మూడేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ విధించిన 40 రోజుల తర్వాత వలస కూలీల తరలింపునకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయడం తుగ్లక్ చర్యని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం ఏం చేసిందని ఆయన నిలదీశారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున కేంద్రం ప్రభుత్వం మాత్రం వారి సంక్షేమాన్ని విస్మరించి చేతులు దులుపుకున్నట్టుగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే 25 లక్షల మంది బిహారీ వలస కూలీలు చిక్కుకుపోయారని, రాజస్ధాన్‌లో 2.5 లక్షల మంది, కేరళలో 4 లక్షల మంది, పంజాబ్‌లో 4 లక్షల మంది, ఒడిషా 7 లక్షలు, అసోంలో 1.5 లక్షల మంది వలస కూలీలు చిక్కుకుపోయారని వార్తలు వచ్చాయని సింఘ్వీ అన్నారు. వీరి తరలింపు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడిచిపెట్టిందని, వాటికి ఎలాంటి నిధులూ విడుదల చేయలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment