
సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పార్లమెంట్‌లో ఎంపీలు సుదీర్ఘంగా చర్చించారు. ఎన్‌కౌంటర్‌పై లోక్‌సభలో తొలుత విపక్ష కాంగ్రెస్ స్పందించింది. దేశంలో మహిళలపై దాడులు దారుణంగా పెరిగిపోతున్నాయని, ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు కనీసం అమలుకు నోచుకోవడం లేదని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అదీర్ రంజన్ చౌదరి సభలో పేర్కొన్నారు. అనంతరం షాద్‌నగర్ ఘటనపై తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన లోక్‌సభలో ప్రస్తావించారు. ఎన్‌కౌంటర్‌ను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ సభ్యులతో పాటు పలు పార్టీలకు చెందిన ఎంపీలూ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు మద్దతుగా తమ గళాన్ని వినిపించారు.
అయితే ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే దేశంలో మహిళలు క్షేమంగా ఎలా జీవిస్తారని ప్రశ్నించింది. ఉన్నావ్ ఘటన నిందితులకు కూడా ఎన్‌కౌంటర్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఉన్నావ్ ఘటనకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు రాజ్యసభలోనూ ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమయింది. నిర్భయ నిందితులకు శిక్ష పడి ఏడేళ్లు గడుస్తున్నా.. ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడం లేదంటూ ఆప్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని, కఠిన శిక్షలు పడేలా చట్టాలను మార్చాలని ఆప్ డిమాండ్ చేసింది.
అయితే విపక్షాల ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఉన్నావ్ ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కానీ ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం సరైనది కాదని విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేసి తీరుతామని మంత్రి లోక్‌సభలో స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో మహిళల సంక్షేమ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment