
పేదలకు మేలు చేసేది మేమే : రాహుల్ గాంధీ
విపక్ష నేతలు చాలానే చెబుతారు...
మోడీపై రాహుల్ పరోక్ష విమర్శలు
బరణ్ (రాజస్థాన్): విపక్ష నేతలు మాటలు చాలానే చెబుతారని, పనులు మాత్రం సంపన్నుల కోసమే చేసి పెడతారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం మాటల్లో కాకుండా, చేతల్లోనే పేదలకు మేలు చేస్తుందని అన్నారు. రాజస్థాన్‌లోని బరణ్ పట్టణంలో మంగళవారం ఏర్పాటైన భారీ ర్యాలీలో ప్రసంగించిన రాహుల్, ముఖ్యంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
అట్టడుగు స్థాయిలో ఉన్న నిరుపేదలు, మహిళలు తమ కలలను సాకారం చేసుకునేలా ఎదగాలన్నదే తమ సంకల్పమని, ఈ సంకల్పమే లేకుంటే తమకు రాజకీయాలతో పని లేదని ప్రజల హర్షధ్వానాల మధ్య అన్నారు. పేదలకు లబ్ధి కలిగించే ఆహార భద్రతా బిల్లు, భూసేకరణ బిల్లు వంటి వాటిని యూపీఏ ప్రభుత్వమే తెచ్చిందని, బలహీన వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఆచరణకు నోచుకోని మాటలు చెప్పడంలో తమకు నమ్మకం లేదని, మాటలతో సరిపుచ్చకుండా, ఏదైనా ఆచరణలో చేసి చూపించడమే తమకు తెలుసునని అన్నారు.
‘మీ బిడ్డలు పెద్దపెద్ద కలలు కనాలని మేం కోరుకుంటాం... మిమ్మల్ని మేం కలలు కననివ్వకపోతే, ఈ దేశం ముందుకు సాగదు’ అని అన్నారు. ‘మా రాజకీయాలు... మీ కలల రాజకీయాలు’ అని వ్యాఖ్యానించారు. ‘కేవలం దాదాపు ఐదువందల మంది మాత్రమే కలలు కనాలని, వారు మాత్రమే విమానాలు, కార్లలో తిరగాలని వారు కోరుకుంటున్నారు. ఇదీ వారి ఆలోచనా ధోరణి’ అని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలను ప్రకటిస్తే, వాటి అమలుకు నిధులు ఎలా వస్తాయని విపక్షాలు ప్రశ్నిస్తాయని, అయితే, భూముల సేకరణ, గనుల కేటాయింపులు వంటి వ్యవహారాల్లో ఎవరూ నోరు మెదపరని అన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ పేదల పక్షానే నిలిచిందని, ఇకపైనా ఇదే పంథాను కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.